Share News

పులులు కన్పించాయా?

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:53 AM

మూడు దశల్లో ఏప్రిల్‌ 20 నుంచి 40రోజుల పాటు చేపట్టిన పులుల గణన ముగిసింది.ఇందుకోసం నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు సిబ్బంది తిరుపతి జిల్లాలో గుర్తించిన 174 పాయింట్లలో కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

పులులు కన్పించాయా?
చెట్లకు అమర్చిన ట్రాప్‌ కెమెరాలను తొలగిస్తున్న అటవీశాఖ సిబ్బంది

-టైగర్స్‌ సెన్సెస్‌ కాలవ్యవధి ముగియడంతో ట్రాప్‌ కెమెరాల పరిశీలనలో అటవీశాఖ

తిరుపతి (కపిలతీర్థం), జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మూడు దశల్లో ఏప్రిల్‌ 20 నుంచి 40రోజుల పాటు చేపట్టిన పులుల గణన ముగిసింది.ఇందుకోసం నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు సిబ్బంది తిరుపతి జిల్లాలో గుర్తించిన 174 పాయింట్లలో కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.గణన కాలం ముగియడంతో తిరుపతి,భాకరాపేట, పనపాకం, శ్రీకాళహస్తి, వెంకటగిరి రేంజిల్లో ఏర్పాటు చేసిన 348ట్రాప్‌ కెమెరాలను తొలగిస్తున్నారు. ఈ కెమెరాల్లో అరుదైన జంతువులు లేదా పులులు ఏమైనా రికార్డయ్యాయా అని పరిశీలించ నున్నారు.మొదటి దశలో పాదముద్రలు, పెంటికలతో పాటు చెట్లను గోర్లతో పులులు గోకిన ప్రదేశాలను గమనిస్తున్నారు.పులుల జాడలు ఉన్నాయో లేదో పరిశీలించాక నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టుకు కెమెరాలను పంపనున్నారు. జిల్లాలో పులుల ఆనవాళ్లు కనుగొనడానికి అటవీశాఖ ఐదు రేంజిలోని కారిడార్లలో పరిశీలించింది.ఇప్పటికే నల్లమల శేషాచల కారిడార్‌ ఏర్పాటైనప్పటికీ పులులున్నాయా లేదా అనే అయోమయంలోనే ఉన్నారు. 2019లో తలకోన సమీపంలో కెమెరాకు టైగర్‌ చిక్కిందని చెబుతున్నా ఇప్పటివరకు ఆనవాళ్లు దొరకలేదు. అయితే లంకమల నుంచి నెల్లూరు వైపు ఏర్పాటుచేసిన కారిడార్‌లో రెండు పులులున్నట్లు గుర్తించారు. ఇపుడు నల్లమల శేషపాచల టైగర్‌ కారిడార్‌ ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నా అది పూర్తిస్థాయిలో జరిగిందా.. శేషాచల కొండల్లో పులులు అడుగుపెట్టాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాపూరు, చిట్వేల్‌ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి ఆనవాళ్లు కనబడ్డాయి. అయితే అది ఇక్కడే వుందా? తిరిగి వెళ్లిపోయిందా అనేది అంతుబట్టడం లేదు.తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలలో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశముంది.

Updated Date - Jun 15 , 2026 | 12:53 AM