తిరుమలలో ఇబ్బందిపడ్డ భక్తులు
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:48 AM
తిరుమలలో పెట్రోల్ బంకులు ఆదివారం మూతపడడంతో శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తిరుమల, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో పెట్రోల్ బంకులు ఆదివారం మూతపడడంతో శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీసీ-5కి సమీపంలో రింగురోడ్డులో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకుతో పాటు ఏఎన్సీ కాటేజీల వద్దనున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల వద్ద ఆదివారం ఉదయం నో స్టాక్ బోర్డులు పెట్టేశారు.దీంతో శ్రీవారి దర్శనం పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణవుదామనుకున్న భక్తులు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. మరోవైపు ట్యాక్సీల్లో ఎక్కిన భక్తులు బస్సులు, ట్రైన్ల సమయం దాటి పోతుందనే భయంతో దిగి ఆర్టీసీ బస్సులపై ఆధారపడ్డారు. ఆదివారం సాయంత్రానికి హెచ్‌పీ పెట్రోల్ బంకు తెరుచుకోవడంతో పరిస్థితి కొంత కుదుటపడింది. సోమవారం ఉదయం మరో బంకు కూడా తెరవనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీలర్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు.