ఉచిత సేవకుడిపై భక్తుల దాడి
ABN , Publish Date - Apr 05 , 2026 | 01:20 AM
ముక్కంటి పీఆర్వో కార్యాలయంలో రగడ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరుకు చెందిన శివ అనే యువకుడు ముక్కంటి ఆలయ పీఆర్వో కార్యాలయంలో ఉచిత సేవకుడిగా విధులు నిర్వహిస్తుంటాడు.
ముక్కంటి ఆలయ పీఆర్వో కార్యాలయంలో రగడ
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ముక్కంటి పీఆర్వో కార్యాలయంలో రగడ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరుకు చెందిన శివ అనే యువకుడు ముక్కంటి ఆలయ పీఆర్వో కార్యాలయంలో ఉచిత సేవకుడిగా విధులు నిర్వహిస్తుంటాడు. ప్రొటోకాల్‌పై వచ్చిన భక్తులను వెంటబెట్టుకుని శనివారం శివ ఆలయంలోకి వెళ్లాడు. అదే సమయంలో శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరు భక్తులు దర్శనానికి వెళ్లిన క్రమంలో అమ్మవారి సన్నిధిలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శివ పీఆర్వో కార్యాలయానికి చేరుకున్నాడు. ఆ వెంటనే ఇద్దరు స్థానిక భక్తులు పీఆర్వో కార్యాలయానికి వెళ్లి శివపై దాడికి దిగారు. తమపై శివ ఆలయంలో దాడి చేశాడని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు, కార్యాలయ సిబ్బంది అందరూ చూస్తుండగానే శివపై దాడి చేశారు. ఈ సమయంలో పరికరాలు, ఫర్నిచర్ చిందరవందరగా మారాయి. ఆలయ అధికారులు ఉచిత సేవకుడు శివపై భక్తులు దాడి చేసిన దృశ్యాలను సీసీపుటేజీ నుంచి సేకరించి శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ ప్రకాష్‌కు అందజేశారు. పోలీసులు కేసు నమోదుచేశారు.