Share News

అన్నదాతలతో అభివృద్ధి ప్రణాళికలు!

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:14 AM

మొహమాటం లేకుండా పార్టీ నాయకశ్రేణికి ‘తొలగింపు’ హెచ్చరికలు చేశారు.

అన్నదాతలతో అభివృద్ధి ప్రణాళికలు!
రైతుల సమావేశంలో సీఎం చంద్రబాబుకు నాగలి బహూకరణ

మొహమాటం లేకుండా పార్టీ నాయకశ్రేణికి ‘తొలగింపు’ హెచ్చరికలు చేశారు. అన్నదాతలతో మమేకమై వారి ఆర్థికాభివృద్ధికి రచిస్తున్న ప్రణాళికలను వివరించారు. పీ-4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో సమావేశమై జీవన ప్రమాణాల మెరుగుదలకు సూచనలు చేశారు. నియోజకవర్గ ఉద్యోగ బృందాన్ని సమావేశపరచి ప్రజలతో ఎలా మెలగాలో, అభివృద్ధిని ఏ తీరున చేయాలో దిశానిర్దేశం చేశారు. టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ద్విపాత్రాభినయంలో చంద్రబాబు మూడో రోజు ఆదివారం నాటి పర్యటన ఫలవంతంగా సాగింది.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం కడపల్లెలోని స్వగృహంలో స్వగృహంలో విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు వెలుపలకు వచ్చిన ఆయన శాంతిపురం చేరుకుని ఈసీ కోళ్ల ఫారమ్‌ ప్రారంభించారు. తిరిగొచ్చే సమయంలో పార్టీ సామాన్య కార్యకర్త చెంగాచారి ఇంటికి వెళ్లి క్షేమ సమాచారాలు అడిగారు. కడపల్లె పంచాయతీలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఆపైన పక్కనే జరిగిన పీ-4 సమావేశానికి హాజరయ్యారు. బంగారు కుటుంబాలు, వారిని దత్తత తీసుకున్న కంపెనీ ప్రతినిధులతో ముఖాముఖి జరిపారు. ఆ సమీపంలోనే నియోజకవర్గ రైతులతో సమావేశమయ్యారు. కుప్పం వ్యవసాయరంగ అభివృద్ధికి వేస్తున్న ప్రణాళికల గురించి వివరించారు. కుప్పం ఉద్యాన ఉత్పత్తులకు పొరుగు రాష్ట్రాలలోని సిటీలలో మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల రాకతో కుప్పం రైతు జీవనం సుఖవంతమవుతుందని వివరించారు. రాత్రి నియోజకవర్గ ఉద్యోగులతో సీఎం చంద్రబాబు సమావేశమై అభివృద్ధిపై సమీక్షించారు. స్వర్ణ కుప్పం సాధనకు ప్రణాళికల తయారీ, ప్రజలతో వ్యవహరించాల్సిన పద్ధతి తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత నాలుగు మండలాలు, కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జిలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీలో వారి పనితీరు, పార్టీ ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. ఇటీవల వివాహాలైన నూతన జంటలను తన స్వగృహంలో చంద్రబాబు ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌ బాబు, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, కడా పీడీ వికాస్‌ మర్మత్‌, నాలుగు మండలాలు, కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులు నందిగం ఉదయ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, రాజగోపాల్‌, సుబ్రమణ్యం, వెంకట్రమణ, కాణిపాకం వెంకటేశ్‌, స్టేట్‌ లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు డైరెక్టర్‌ విశ్వనాథ నాయుడు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:14 AM