మల్లమ్మ చెరువులో ఏనుగుల విధ్వంసం
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:52 AM
కుప్పం మండలం ఉర్లవోబనపల్లె పంచాయతీ మల్లమ్మచెరువు గ్రామంలో రెండు రోజులుగా ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి.
కుప్పం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కుప్పం మండలం ఉర్లవోబనపల్లె పంచాయతీ మల్లమ్మచెరువు గ్రామంలో రెండు రోజులుగా ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అటవీ లోతట్టు ప్రాంతంలోని ఈ గ్రామ పొలాలపై ఆరు ఏనుగులు రాత్రి వేళల్లో దాడులు చేసి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. టమోటా, సొర, బీన్స్ తోటలు నాశనం అవుతున్నాయి. పశువుల మేతకోసం వేసిన జొన్నగడ్డినీ తొక్కి ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో కొబ్బరి చెట్లలోని కాయలు పక్వానికి రాకముందే రాలి పోతున్నాయి. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఏనుగుల దాడులవల్ల తమ ప్రాణాలకు కూడా రక్షణ లేదని రైతులు వాపోతున్నారు.