పుత్రశోకం కల్గినా మరికొందరికి ప్రాణదానం
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:32 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన తన బిడ్డ అవయవాలను దానం చేసింది
చిత్తూరు అర్బన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తనకు పుత్రశోకం కల్గినా మరికొందరికి ప్రాణదానం చేయాలని ఆ తల్లి భావించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన తన బిడ్డ అవయవాలను దానం చేసింది. చిత్తూరు నగరంలోని రంగాచారి వీధికి చెందిన దివంగత వెంకటేశ్ కుమారుడు రాహుల్(22) ఆర్‌కే డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది ఒకటో తేదీన స్నేహితులతో కలిసి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంతో రాహుల్ తలకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని తల్లి అమ్ము వెంటనే వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆదివారం సీఎంసీ నుంచి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి రాహుల్‌ను తీసుకొచ్చారు. అక్కడున్న వైద్యులు, స్థానికులు కొందరు అవయవదానంపై అమ్ముకు తెలిపారు. తనకు పుత్రశోకం కల్గినా.. మరికొందరికి ప్రాణదానం చేయొచ్చని తెలియడంతో బిడ్డ అవయవాలను దానం చేయడానికి అంగీకరించింది. సోమవారం సాయంత్రం రాహుల్.. గుండె, కాలేయం, కిడ్నీలు, కంటి కార్షియాలను తీసుకుని మృతదేహాన్ని తల్లికి అప్పగించారు. రాహుల్ మృతదేహం వద్ద వైసీపీ చిత్తూరు ఇన్‌చార్జి విజయానందరెడ్డి నివాళి అర్పించి, కుటుంబీకులకు రూ.25వేల ఆర్థిక సాయం అందించారు. ఆయనవెంట కార్పొరేటర్ అల్తాఫ్ తదితరులున్నారు.