Share News

8 ఏళ్ల తర్వాత డిపాజిట్లు వెనక్కి..

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:30 AM

సొంతింటి కల నెరవేరుతుందని అప్పులు చేసి మరీ ప్రభుత్వానికి డిపాజిట్లు చెల్లించిన పేదలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పునాది దశలో ఉన్న టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. అంతేకాకుండా వారు చెల్లించిన డిపాజిట్లనూ తిరిగివ్వలేదు. రద్దయిన వారికి డిపాజిట్లు తిరిగివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో ఈఏడాది మేలో వివరాలను సేకరించింది. ఇప్పుడు వారికి డిపాజిట్లు తిరిగిస్తున్నారు. వైసీపీ దుశ్చర్యతో సుమారు 8 ఏళ్ల తర్వాత డిపాజిట్‌ మాత్రమే వారికి దక్కుతోంది.

8 ఏళ్ల తర్వాత డిపాజిట్లు వెనక్కి..
చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గురుజాల, కమిషనర్‌ నరసింహప్రసాద్‌

టిడ్కో లబ్ధిదారులకు కొంతమేర ఊరట

ఉమ్మడి జిల్లాలో 17,395 గృహాలను మంజూరు చేసిన అప్పటి టీడీపీ

వైసీపీ వచ్చాక పునాది దశలోని 6288 గృహాల రద్దు

రద్దయిన వారికి డిపాజిట్లు ఇవ్వకుండా ఐదేళ్లు వేధింపులు

రీఫండ్‌కు కూటమి నిర్ణయం

వారంలోగా చెల్లింపు ప్రక్రియ పూర్తి

సొంతింటి కల నెరవేరుతుందని అప్పులు చేసి మరీ ప్రభుత్వానికి డిపాజిట్లు చెల్లించిన పేదలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పునాది దశలో ఉన్న టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. అంతేకాకుండా వారు చెల్లించిన డిపాజిట్లనూ తిరిగివ్వలేదు. రద్దయిన వారికి డిపాజిట్లు తిరిగివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో ఈఏడాది మేలో వివరాలను సేకరించింది. ఇప్పుడు వారికి డిపాజిట్లు తిరిగిస్తున్నారు. వైసీపీ దుశ్చర్యతో సుమారు 8 ఏళ్ల తర్వాత డిపాజిట్‌ మాత్రమే వారికి దక్కుతోంది.

- చిత్తూరు,ఆంధ్రజ్యోతి

టీడీపీ ప్రభుత్వం 2018-19లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో అర్హులకు గృహ నిర్మాణాలను చేపట్టింది. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు రకాల నిర్మాణాలను ప్రారంభించింది. 300 చదరపు అడుగుల గృహానికి లబ్ధిదారుడి వాటా రూ.500 కాగా, 365 చ.అడుగులకు రూ.50 వేలు, 430 చ.అడుగులకు రూ.లక్ష వేసుకోవాలి. అంటే ఈ మొత్తాన్ని లబ్ధిదారుల నుంచి అధికారులు నిర్మాణానికి ముందే వసూలు చేశారు. ప్రతి యూనిట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.1.50 లక్షల చొప్పున, మొత్తం రూ.3 లక్షలు ఉంటుంది. యూనిట్‌ను బట్టి బ్యాంకు రుణాలూ ఉంటాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 17,395 టిడ్కో గృహాలు మంజూరయ్యాయి. అప్పట్లోనే లబ్ధిదారుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు.

వైసీపీ రద్దు నిర్ణయంతో నష్టం

వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020 జూన్‌లోనే పునాది దశలో ఉన్న టిడ్కో గృహాలను రద్దు చేసేసింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాటిల్లో 6288 గృహాలు రద్దయ్యాయి. ఇళ్లను రద్దు చేసినా డిపాజిట్లను వెనక్కి ఇవ్వలేదు. రద్దయిన గృహాల్లో 1360 మంది రూ.500 వంతున చెల్లించిన రూ.6.80 లక్షలు... 2784 మంది రూ.50 వేల చొప్పున చెల్లించిన రూ.13.92 కోట్లు... 2384 మంది రూ.లక్ష చొప్పున చెల్లించిన రూ.23.84 కోట్ల డిపాజిట్లను వెనక్కి ఇవ్వలేదు. మొత్తంగా రూ.37.82 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంది. ఇల్లు దక్కలేదు. డిపాజిట్‌ వెనక్కి ఇవ్వలేదని లబ్ధిదారులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

డిపాజిట్లు ఇస్తున్నా.. కాసింత బాధే..

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కూటమి బాధ్యత వహిస్తూ రద్దయినవారి డిపాజిట్లు వెనక్కి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మేలోనే సంబంధిత పత్రాలను మున్సిపాలిటీల్లో సేకరించారు. ప్రస్తుతం వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇల్లు దక్కలేదనే బాధ ఓ వైపు.. 8 ఏళ్ల కిందట కట్టిన డబ్బులు అసలు మాత్రమే వెనక్కి ఇస్తున్నారనే బాధ మరోవైపు రద్దయినవారిలో ఉంది. వైసీపీ అది కూడా ఇవ్వలేదనే నిట్టూర్పూ ఉంది.

చిత్తూరులో రూ.3.71 కోట్ల పంపిణీ

చిత్తూరులోని పూణేపల్లె వద్ద పునాది దశలో ఉన్న 672 గృహాలను వైసీపీ రద్దు చేసింది. మిగిలిన 2832 గృహాల నిర్మాణానికి అప్పట్లోనే టీడీపీ రూ.140 కోట్లను ఖర్చు చేసింది. ఇళ్లు రద్దయిన లబ్ధిదారులకు సుమారు రూ.6 కోట్ల వరకు డిపాజిట్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంది. 570 మంది సక్రమమైన డాక్యుమెంట్లు అందించగా, వారిలో తొలి విడతగా 370 మందికి చెందిన డిపాజిట్లు రూ.3.71 కోట్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చేరాయి. ఈ నిధుల్ని శనివారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తదితరులు లబ్ధిదారులకు అందించారు. మిగిలిన రూ.2.30 కోట్లు రెండో విడతలో రానున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

మున్సిపాలిటీల్లోనూ..

ఉమ్మడి జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా రద్దయినవారికి డిపాజిట్లు తిరిగేచ్చే ప్రక్రియ పురోగతిలో ఉంది. ఇప్పటికే రద్దయినవారి వివరాలను సేకరించగా, తిరుపతిలో నెల నుంచి వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. నగరిలో రద్దయిన 528 మందికి రూ.43 లక్షల్ని వచ్చే వారం అందించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Jul 12 , 2026 | 01:30 AM