Share News

నిండుకున్న గోదాములు

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:34 AM

ప్రజా పంపిణీకి ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం సరఫరాలో జాప్యం అవుతోంది. స్టేజ్‌-1(ఐరాల) నుంచి స్టేజ్‌-2(ఎంఎల్‌ఎస్‌) మండల కేంద్రాల పాయింట్లకు కాంట్రాక్టర్‌ సకాలంలో సరఫరా చేయడం లేదు. దీంతో నిర్ణీత సమయంలో చౌకదుకాణాలకు చేరక అటు అధికారులు, ఇటు కార్డుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నిండుకున్న గోదాములు
మదనపల్లెలోని మండల స్టాకు గోదాము

- రేషన్‌ బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం

- డీలర్లకు, కార్డుదారులకు తప్పని తిప్పలు

ప్రజా పంపిణీకి ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం సరఫరాలో జాప్యం అవుతోంది. స్టేజ్‌-1(ఐరాల) నుంచి స్టేజ్‌-2(ఎంఎల్‌ఎస్‌) మండల కేంద్రాల పాయింట్లకు కాంట్రాక్టర్‌ సకాలంలో సరఫరా చేయడం లేదు. దీంతో నిర్ణీత సమయంలో చౌకదుకాణాలకు చేరక అటు అధికారులు, ఇటు కార్డుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

మదనపల్లె, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1,124 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటికి మదనపల్లె, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, పుంగనూరు, సదుం, వాల్మీకిపురం, కలికిరి, కలకడ, పీలేరు, చిన్నమండ్యం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒకటి, రెండు రోజులకు ఒకటి, రెండు లోడులు మాత్రమే వస్తుండటంతో వచ్చిన బియ్యం వచ్చినట్లే షాపులకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా మండల కేంద్రాల్లోని గోదాములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్క గోదాము కూడా స్టాకు లేకుండా ఉండకూడదు. ఒక పక్క చౌక దుకాణాలకు స్టాకు సరఫరా చేస్తుండగా, మరోపక్క బియ్యాన్ని గోదాములో నిల్వ చేయాలి. కానీ ఇటీవల కాలంలో ఆ పరిస్థితి కనిపించలేదు. ముఖ్యంగా మూడు నెలలుగా ప్రస్తుత పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రతినెలా 30వ తేదీ లేదా మరుసటి నెల ఐదో తేదీ లోపల లిఫ్టింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. కానీ కార్డుదారులకు పంపిణీ పూర్తయ్యే 15వ తేదీ వరకూ కూడా సరఫరా చేస్తూనే ఉన్నారు.

ఎందుకీ పరిస్థితి..!

అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కలిపి ఒకే కాంట్రాక్టర్‌ ఉండటంతో సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ చిత్తూరు, తిరుపతి జిల్లాల తరహాలో అన్నమయ్యకు సరఫరా చేయలేదని చెబుతున్నారు. ఇందుకు కారణాలు విశ్లేషిస్తే స్టేజీ-1లో సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఉండి జిల్లాలోని ఆయా గోదాములకు స్టాకుతోపాటు లారీలను రోజువారి అలాట్‌ చేస్తుంటారు. లారీలకు బియ్యం లోడ్‌ చేశాక బిల్లుతోపాటు వెయింగ్‌ బ్రిడ్జికి వెళ్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చాక అసలైన తంతు మొదలవుతుంది. డీజిల్‌ పట్టడానికి పెట్రోల్‌ బంకుకు వెళ్తే అక్కడ తీవ్ర జాప్యం అవుతున్నట్లు చెబుతున్నారు. అక్కడ డీజిల్‌ పట్టడానికి డ్రైవర్లు ఒకరోజంతా నిరీక్షించాల్సి వస్తోందంటున్నారు. అలాగే తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారి మార్గమధ్యలోని గండబోయినపల్లె టోల్‌ ప్లాజా వద్ద కూడా కొన్నిసార్లు లారీ ఆగిపోతున్నట్లు సమాచారం. ఏంటని ఆరా తీస్తే టోల్‌ ఫీ చెల్లించడానికి డ్రైవర్‌ ఓనర్‌ కోసం ఫోన్‌ కోసం వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. అలాగే ఆయా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వచ్చిన లారీలు ఇక్కడి నుంచి తిరిగి స్జేజ్‌-1కు వెళ్లడానికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. అసలే రెండురోజులకోసారి లారీ వస్తుంటే వచ్చేవి కూడా డీజిల్‌ లేక, టోల్‌ ఫీజు కోసం ఆపేయడంతో జాప్యం అవుతున్నట్లు హమాలీలు వాపోతున్నారు.

అవస్థలు పడుతున్న కార్డుదారులు

ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో మిల్లర్ల నుంచి రైలు వ్యాగన్లలో ఐరాలకు బియ్యం సరఫరా అవుతోంది. చౌకదుకాణాల్లో కార్డుదారులకు 15వ తేదీతో సరఫరా పూర్తయ్యాక రెండు రోజుల గ్యాప్‌తో స్టేజ్‌-1 కాంట్రాక్టర్‌ ప్రతినెలా 17వ తేదీ నుంచి నెలాఖరు వరకూ స్టాకు గోదాముకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. నెల పొడవునా రెండుమూడు రోజులకో ఒకటి, రెండు లారీల చొప్పున మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో గోదాములో పనిలేక సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు, సిబ్బంది, స్టేజ్‌-2 కాంట్రాక్టర్‌తోపాటు హమాలీలు ఖాళీగా ఉంటున్నారు. మరోవైపు ఆయా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలోని మండలాలు, ఆయా చౌకదుకాణాలకు సకాలంలో బియ్యం సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో అరకొర స్టాకు రవాణాతో కార్డుదారులు చౌకదుకాణం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Sep 01 , 2026 | 01:35 AM