Share News

కూలీలకు వీబీ జీరామ్‌జీ చెల్లింపుల్లో జాప్యం

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:34 AM

అడిగిన వారికి ఉపాధి కల్పిస్తాం..లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాం..వేతనం చెల్లింపులో 15 రోజుల ఆలస్యమైతే..బాకీ వేతనానికి 0.05శాతం వడ్డీ చెల్లిస్తాం.. ఇదీ వీబీ జీరామ్‌జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట. క్షేత్రస్థాయిలో చూస్తే ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 27వేల మంది ఉపాధి కూలీలకు ఏడు వారాల వేతనం ఇంకా అందలేదు. వినాయకచవితి పండుగ వస్తోంది..ఇలాంటి సమయంలో కూడా చేసిన పనికి డబ్బులు అందక పస్తులుండాల్సిందేనా.? అంటూ ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 కూలీలకు  వీబీ జీరామ్‌జీ చెల్లింపుల్లో జాప్యం

పేరుకుపోయిన రూ.28కోట్ల బకాయిలు

0.05 వడ్డీ పరిహారం మాట ఏమిటి?

వినాయక పండగ వస్తున్నా తప్పని నిరీక్షణ

అడిగిన వారికి ఉపాధి కల్పిస్తాం..లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాం..వేతనం చెల్లింపులో 15 రోజుల ఆలస్యమైతే..బాకీ వేతనానికి 0.05శాతం వడ్డీ చెల్లిస్తాం.. ఇదీ వీబీ జీరామ్‌జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట. క్షేత్రస్థాయిలో చూస్తే ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 27వేల మంది ఉపాధి కూలీలకు ఏడు వారాల వేతనం ఇంకా అందలేదు. వినాయకచవితి పండుగ వస్తోంది..ఇలాంటి సమయంలో కూడా చేసిన పనికి డబ్బులు అందక పస్తులుండాల్సిందేనా.? అంటూ ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-మదనపల్లె టౌన్‌ (ఆంధ్రజ్యోతి)

ఉపాధి పనులకు వెళితే రోజుకు రూ.312 వరకూ వేతనం వస్తుంది. ఏడాదికి 125 రోజుల పనిదినాలు కల్పిస్తూ ప్రతి వారం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. జూలై 1వ తేదీ నుంచి జిల్లాలో వీబీజీ రామ్‌జీ పథకం అమలులోకి వచ్చింది. అడిగిన వారికి లేదనకుండా పనులు కల్పిస్తున్నారే గాని..నిర్దేశించిన సమయానికి కూలీల వేతనాలు మాత్రం చెల్లించడం లేదు. ఈ పథకం అమలు కాక ముందు జూన్‌ చివరి రెండు వారాలకు రూ.8కోట్ల దాకా కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. తరువాత జూలైలో జరిగిన పనులకు రూ.17 కోట్ల మేర వేతనాలను నెల రోజులు ఆలస్యంగా అంటే ఆగస్టు 1న కూలీల బ్యాంకు ఖాతాలకు జమచేశారు. దీని తరువాత ఆగస్టులో నాలుగు వారాల పాటు ప్రతిరోజు 27వేల మంది కూలీలు ఉపాధి పనులు నిర్వహించారు. వీరికి రూ.16.6కోట్ల వేతనాలు చెల్లించాల్సి వుంది. దీనికి తోడు జూన్‌లో రెండు వారాలు, ఆగస్టులో నాలుగు వారాలు, సెప్టెంబరు నెలలో మొదటి వారం వేతనాలు కలిపి ఏడు వారాల వేతనాలు, రూ.28కోట్ల దాకా కూలీలకు వేతనాలు బకాయిలు పడ్డారు.

వీబీజీ రామ్‌జీలో పారదర్శకత ఏదీ?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకంలోని నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలు పనిచేసిన వారం రోజుల వేతనాలను చివరి రోజు బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. 15 రోజుల పాటు వేతనాలు చెల్లించకుంటే బాకీ పడిన వేతన సొమ్ముకు రూ.0.05శాతం వడ్డీ కలిపి నష్టపరిహారంగా చెల్లించాలి. వాస్తవానికి జిల్లాలో గడచినలో కూలీలకు వేతన బకాయిలు రూ.16.6కోట్లు ఇంత వరకు చెల్లించేలేదు. అంటే కూలీలకు నష్టపరిహారం రూ.83వేల దాకా కూలీలకు అదనంగా చెల్లించాల్సి వుంది. ఈ వడ్డీ సొమ్ముల చెల్లింపులో అధికారులు పారదర్శకత చూపడం లేదు. వడ్డీ సొమ్ము పక్కన పెట్టి చేసిన పనికి కూలీలు చెల్లించడయ్యా అంటూ వేతన జీవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండగ పూట కూడా పస్తులేనా..?

నెల రోజులు మట్టిపనులు చేశాం.వారం వారం డబ్బులు ఇస్తామన్నారు. ఐదు వారాలవుతున్నా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. వినాయకుడి పండగ వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. పండగ ఎట్లా జరపాలి. పండగ పూట కూడా పస్తులేనా సామి..?

రత్నమ్మ, విఠలం గ్రామం, వాల్మీకిపురం మండలం.

బయట పనులకు పోతే సంతరోజే డబ్బులు

ఏందో కొత్తపథకంలో కూలి డబ్బులు లేటు చేస్తే వడ్డీతో చెల్లిస్తామన్నారు. నాలుగు వారాలుగా కూలి డబ్బులు ఇవ్వడం లేదు. బయట పనులకు వెళితే సంత రోజే డబ్బులిచ్చేస్తారు. పల్లె కాడ పనులు సులువుగా వుంటాయని చేస్తున్నామే కాని, డబ్బులు మాత్రం పడటం లేదు.

లక్ష్మీనారాయణ, విఠలం గ్రామం, వాల్మీకిపురం మండలం.

ఉన్నతాధికారుల ఉత్తర్వులు రావాలి

ఉపాధి పనులు చేసిన వారికి వేతనాలు చెల్లించడంలో ఆలస్యమవుతున్న విషయం నిజమే. ఆగస్టు నెలకు సంబంధించి రూ.16.6కోట్ల వేతనాలు చెల్లించాలి. ఎందుకు ఆలస్యమవుతోందో తెలియడం లేదు. వాస్తవ విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తూనే ఉన్నాం. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావాలి. వేతనాలు మంజూరవుతూనే కూలీల ఖాతాల్లో జమచేస్తాం.

- వెంకటరత్నం, డ్వామా పీడీ

Updated Date - Sep 09 , 2026 | 01:34 AM