ఎల్‌నినోకు ఎదురొడ్డి.. కొద్దిపాటి నీటితోనే వరిసాగు
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:20 AM
ఎల్‌నినో ప్రభావంతో కొన్ని నెలలుగా వర్షాలు లేవు. ఎటుచూసినా బీడు భూములే కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కొద్దిపాటి నీరున్నా సాగుకు సరిపడే పరిస్థితి లేదు. అయినా మదనపల్లె జిల్లా రైతులు సాహసం చేశారు. వరి సాగుకు ఉపక్రమించారు. వరినాట్లతో బిజీగా కనిపిస్తున్నారు.
4,905 హెక్టార్లలో నాట్లు
ఎల్‌నినో ప్రభావంతో కొన్ని నెలలుగా వర్షాలు లేవు. ఎటుచూసినా బీడు భూములే కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కొద్దిపాటి నీరున్నా సాగుకు సరిపడే పరిస్థితి లేదు. అయినా మదనపల్లె జిల్లా రైతులు సాహసం చేశారు. వరి సాగుకు ఉపక్రమించారు. వరినాట్లతో బిజీగా కనిపిస్తున్నారు.
మదనపల్లె టౌన్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదేళ్లుగా రబీ సీజన్‌లో రైతులు వరిసాగు చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిస్తే చెరువులకు వచ్చే నీటితో వేలాది ఎకరాల్లో వరి సాగు చేసేవారు. గత ఏడాది రబీ సీజన్‌కు ముందే విరివిగా వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు నిలిచింది. దీంతో గత ఏడాది రబీ సీజన్‌లో సాధారణ సాగు 7,522 హెక్టార్లు కాగా రైతులు 7,402 హెక్టార్లలో 98శాతం వరిసాగు చేసి ఔరా అనిపించారు. అంతకుముందు ఐదేళ్ల గణాంకాలు తీసుకుంటే 2022వ సంవత్సరంలో 3,680 హెక్టార్లు, 2023లో 3,543, 2024లో 6,560, 2025లో 6,885 హెక్టార్లలో వరిసాగు చేశారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా ఒక్క చుక్క కూడా వర్షం కురవలేదు. 78శాతం లోటు వర్షపాతం ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక లోటు వర్షపాతం ఉన్న జిల్లాగా అన్నమయ్య నమోదైంది.
39శాతంతో 4,950 హెక్టార్లలో వరిసాగు
జిల్లాలో 2026-27 రబీ సీజన్‌లో వరిపంట సాధారణ సాగు 12,745 హెక్టార్లు ఉండగా ఇప్పటివరకు 4,950 హెక్టార్లలో రైతులు వరినాట్లు వేశారు. ఇంకా 25శాతం నీరు నిల్వ ఉన్న చెరువుల కింద రైతులు నాట్లు వేస్తూనే ఉన్నారు. దీనికితోడు చెరువు కింద భూముల్లో బోర్లలో ఉన్న నీటిని చూసి ధైర్యం చేసిన రైతులు వరిసాగు చేస్తున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో చూస్తే అత్యధికంగా చౌడేపల్లె మండలంలో 663 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. రెండో స్థానంలో సదుంలో 448 హెక్టార్లు, పుంగనూరులో 388, సోమలలో 381 హెక్టార్లతో వరిసాగు చేస్తుండగా, అతి తక్కువగా రామసముద్రం మండలంలో 7 హెక్టార్లలో మాత్రమే సాగు చేస్తున్నారు.
పీఎండీఎస్ కంటే వరివైపే మొగ్గు
ఓ వైపు కలెక్టర్, వ్యవసాయశాఖ అధికారులు పీఎండీఎ్‌స(ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) విధానంలో ఎల్‌నినోను తట్టుకునేలా మిశ్రమ పంటల సాగు చేయాలని అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే జూలై వరకు వర్షాలు కురవవని హెచ్చరిస్తూనే ఉన్నారు. వరి సాగుకు దూరంగా ఉండాలని, తక్కువ ఖర్చుతో లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని చెబుతూనే ఉన్నారు. కాని ఉన్న కొద్దిపాటి నీటిని చూసుకుని ఆశలు చావని రైతులు ధైర్యంగా వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని సవ్యంగా జరిగి చెరువుల్లో ఉన్న నిల్వ నీరు ఈ ఏడు రబీ సాగుకు సరిపోతే వరి రైతులు గట్టెక్కుతారు. లేదంటే నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.