మృత్యుంజయుడు
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:03 AM
కరెంటు స్తంభంపైన.. విద్యుత్తు తీగలకు చిక్కుకుని అచేతనంగా వేలాడుతున్న ఈ వ్యక్తిని చూసిన స్థానకులు కంగారుపడ్డారు. ప్రాణాపాయమే జరిగుంటుందన్న ఆందోళనతో పరుగు తీశారు. కొంతసేపటికి ఆ వ్యక్తిలో చిన్న కదలిక వచ్చింది. ఇలా మృత్యుంజయుడిగా బయట పడిన మహేంద్రను ఆస్పత్రికి తరలించారు.
స్తంభంపై కరెంటు తీగలు సరిచేస్తుండగా ప్రమాదం
కరెంటు స్తంభంపైన.. విద్యుత్తు తీగలకు చిక్కుకుని అచేతనంగా వేలాడుతున్న ఈ వ్యక్తిని చూసిన స్థానకులు కంగారుపడ్డారు. ప్రాణాపాయమే జరిగుంటుందన్న ఆందోళనతో పరుగు తీశారు. కొంతసేపటికి ఆ వ్యక్తిలో చిన్న కదలిక వచ్చింది. ఇలా మృత్యుంజయుడిగా బయట పడిన మహేంద్రను ఆస్పత్రికి తరలించారు. గంగవరం మండలంలోని నాలుగురోడ్ల గ్రామం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకొంది.
పెద్దపంజాణి మండలం గోనుమాకులపల్లెకు చెందిన మహేంద్ర.. గండ్రాజుపల్లె సబ్‌స్టేషన్ పరిధిలో కాంట్రాక్ట్ పద్దతిన ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం డ్యూటీకి వెళ్లారు. నాలుగురోడ్ల గ్రామం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మరు ట్రిప్ అయి ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా ఆగిందని సమాచారం అందింది. వెంటనే ఆయన సబ్‌స్టేషన్‌లో ఎల్‌సీ తీసుకొని కరెంటు స్తంభంపైకి ఎక్కారు. ట్రిప్ అయిన కరెంటు తీగను సరిచేస్తున్నారు. అంతలో ఉన్నట్లుండి పక్కకు వెల్లకిలాపడి కరెంటు తీగలలో చిక్కుకున్నారు. అచేతనంగా వేలాడుతున్న ఆయన్ను చూసి.. ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని స్థానికులు హుటాహుటిన పరుగులు తీశారు. అప్పటికే కరెంటు తీగలపై మహేంద్ర వేలాడుతూ చలనం లేకుండా కనిపించారు. అయ్యోపాపం అంటూ అప్పటికప్పుడే విద్యుత్ శాఖ అధికారులకు, 108కు స్థానికులు సమాచారమిచ్చారు. జనం గుమిగూడే లోపు.. మెల్లగా కరెంటు తీగలపై నుంచి అతడు కదులుతూ పైకి లేవడానికి ప్రయత్నించారు. హమ్మయ్య.. బతికే ఉన్నారంటూ పక్కనే ఉన్న ఓ నిచ్చెన తీసుకొచ్చి కరెంటు స్తంభానికి వేశారు. మెల్లగా ఆయన నిచ్చెన ద్వారా కిందికి దిగారు. వెంటనే ఆయన్ను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు.
ఏం జరిగిందంటే..
‘మరమ్మతు చేస్తున్న సమయంలో అదే కరెంటు స్తంభంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు వెళ్లే లైన్‌లో కరెంటు సరఫరా ఉంది. ఆ లైన్ తగలడంతో షాక్ తగిలి పడిపోయి ఉంటా. మళ్లీ షాక్ నుంచి తేరుకునేలోపు ఇండస్ట్రియల్‌కు వెళ్తున్న ఆ లైన్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఉంది’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేంద్ర చెప్పారు. - గంగవరం, ఆంధ్రజ్యోతి