Share News

అసెంబ్లీ కమిటీ ముందుకు డీసీసీబీ

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:56 AM

వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన నిధుల దుర్వినియోగం, లావాదేవీలపై శాసనసభా సంఘం విచారణ చేపట్టనుంది.

అసెంబ్లీ కమిటీ ముందుకు డీసీసీబీ
డీసీసీబీ ప్రధాన కార్యాలయం

వైసీపీ హయాంలో నిధుల దుర్వినియోగంపై నేడు విచారణ

సమగ్ర వివరాలతో బయలుదేరిన అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన నిధుల దుర్వినియోగం, లావాదేవీలపై శాసనసభా సంఘం విచారణ చేపట్టనుంది. ఆ కమిటీ చైర్మన్‌, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అధ్యక్షతన మంగళవారం అసెంబ్లీ అసెంబ్లీ హాలు నెంబరు-2లో జరిగే విచారణకు అధికారులు హాజరుకానున్నారు. వైసీపీ హయాంలో డీసీసీబీకి సెవెన్‌మెన్‌.. సింగిల్‌ విండోలకు త్రిసభ్య కమిటీలను నియమించారు. ఆ సమయంలో భూమి లేకున్నా వైసీపీ కార్యకర్తలకు పంట రుణాలు, వివిధ పథకాలకు నిధులు ఇచ్చారన్న విమర్శలున్నాయి. ఫలితంగా డీసీసీబీలో రూ.105 కోట్ల మేరకు మొండి బకాయిలు పేరుకుపోయాయి. ఆయా వివరాలతో సభాసంఘం ఎదుట హాజరుకావాలని సోమవారం అధికారులకు ఆదేశాలొచ్చాయి. దీంతో డీసీసీబీలో 2019-20 నుంచి 2023-24 వరకు ఐదేళ్ల లావాదేవీల వివరాలను అధికారులు సిద్ధం చేసుకుని బయలుదేరారు. వాస్తవానికి అసెంబ్లీ కమిటీ తొలి సమావేశం గతేడాది నవంబరు 16న జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా పడింది. ఆ మేరకు మంగళవారం విచారణ జరగనుంది. ఈ విషయాన్ని డీసీసీబీ సీఈవో శంకర్‌బాబు వద్ద ప్రస్తావించగా.. ‘ఐదేళ్లలో ఇచ్చిన రుణాల వివరాలు, గోదాముల స్థితిగతుల గురించి సమాచారం కోరారు. పూర్తి వివరాలను శాసనసభా కమిటీకి అందజేస్తాం. మంగళవారం జరిగే విచారణకు నేను, డీసీవో లక్ష్మి హాజరవుతున్నాం’ అని చెప్పారు.

ఏం జరిగిందంటే?

ఫ జిల్లాలోని 75 సహకార సంఘాల్లో 50 శాతం వరకు నష్టాల్లోనే ఉన్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వం అవసరం ఉన్నా.. లేకున్నా గోదాముల నిర్మాణం చేపట్టింది. ఒక్కోదానికి రూ.40 లక్షల చొప్పున సహకార సంఘం ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లించేలా ఒప్పందం చేశారు. 57 గోదాములు మంజూరు కాగా, 46 నిర్మాణాలు చేపట్టారు. వాటిలో 34 పూర్తయ్యాయి. ఈ గోదాములకు రూ.40 లక్షల చొప్పున నాలుగు శాతం వడ్డీతో ఏడేళ్ల వాయిదాలతో సింగిల్‌విండోలు చెల్లించేలా డీసీసీబీ రుణమిచ్చింది. కట్టిన గోదాములు నిరుపయోగంగా ఉన్నాయి. విండోలకు ఆదాయం లేదు. దీంతో డీసీసీబీకి రూ.12 కోట్ల మేరకు కంతులు చెల్లించని పరిస్థితి ఏర్పడింది.

ఫ ఇక, డీసీసీబీపై ఒత్తిడి తెచ్చి జగనన్న తోడు ద్వారా రూ. 22 లక్షలు, జగనన్న పాల వెల్లువకు రూ.8 కోట్లు, కస్టమ్స్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా రూ.4కోట్లు, ఫిష్‌ ఆంధ్ర పేరిట రూ.32 లక్షల రుణాలిప్పించారు. పైసా కూడా డీసీసీబీకి రికవరీ కాలేదు. వీటిలో చాలా యూనిట్లు లేవు. లబ్ధిదారుల వివరాలతో నివేదిక సిద్ధం చేశారు.

ఫ అప్పట్లో చాలాచ్లో వైసీపీ నేతలు, కార్యకర్తలకు సరైన రికార్డుల్లేకుండా పంట రుణాలిచ్చారన్న ఆరోపణలున్నాయి. పాలకవర్గ సభ్యులు వారి బంధువుల పేర్లతో రికార్డుల్లేకుండా రూ.10కోట్ల వరకు తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో పైసా కూడా వసూలు కాలేదని సమాచారం.

ఫ కొన్ని బ్యాంకు శాఖలు, సింగిల్‌ విండోల ద్వారా వైసీపీ శ్రేణులు దొంగ పేర్లతో పాడి పశువులు కొన్నట్లు చూపి ఆమూల్‌ రుణాలు పొందారు. నాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేత ఆదేశాలతో డీసీసీబీ నుంచే వీరికి రూ.20 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై గతంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాలతో డీఆర్వో మోహన్‌ కుమార్‌ విచారించి నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం 48 మంది బ్యాంకు ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపారు. డీఆర్వో నివేదికలో రూ.23కోట్ల మేర అవినీతి జరిగినట్లు తేల్చారు. ఇందులో 60-1 సెక్షన్‌పై విచారణకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశిస్తూ రికవరీ ఆఫీసర్‌గా సర్వశిక్ష అభియాన్‌ పీవో వెంకటరమణను నియమించారు. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లి స్టే తేవడంతో విచారణ ఆగిపోయింది.

Updated Date - Feb 24 , 2026 | 12:56 AM