Share News

సైబర్‌ పనితీరు ప్రశంసనీయం: డీజీపీ

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:26 AM

తిరుపతి జిల్లా సైబర్‌ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేస్తోందని డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా ప్రశంసించారు

 సైబర్‌ పనితీరు ప్రశంసనీయం: డీజీపీ
సెంట్రల్‌ పోలీస్‌ క్యాంటీన్‌ భవన నిర్మాణానికి డీజీపీ దంపతుల భూమిపూజ

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): జిల్లా సైబర్‌ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేస్తోందని డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా ప్రశంసించారు.తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌, పోలీసు సంక్షేమంపై జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు.కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పటిష్ఠ నైట్‌ బీట్‌, డ్రోన్‌ సాంకేతిక వినియోగం, సైబర్‌ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలు, కలెక్టర్‌తో కలిసి బ్లాక్‌ స్పాట్ల గుర్తింపుకు చేసిన బస్సు యాత్ర, చేపట్టిన చర్యల గురించి ఎస్పీ సుబ్బరాయుడు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న డ్రగ్‌ టెస్టింగ్‌, ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ బాగుందన్నారు.ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు.మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం ఉదయం తిరుమలలో సతీమణి సీమాగుప్తాతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయన శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మధుసూదన రెడ్డితో కలిసి నేరుగా తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు.పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించాక సెంట్రల్‌ పోలీస్‌ క్యాంటీన్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయ ప్రహరీ, గార్డ్‌ రూమ్‌ నిర్మాణాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. మధ్యాహ్న భోజన అనంతరం ఆయన పుత్తూరుకు వెళ్లి డీఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. తరువాత చిత్తూరుకు బయల్దేరి వెళ్లారు.ఏఎస్పీలు రవిమనోహరాచారి, శ్రీనివాసులు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 01:26 AM