ఔషధ ఉల్లి సాగు... ఆదాయం బాగు
ABN , Publish Date - May 18 , 2026 | 01:00 AM
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తోటల వద్దనే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
తంబళ్లపల్లె, మే 17(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లె మండలం పరుసతోపు పంచాయతీ నాయనప్పగారిపల్లెకు చెందిన అమరనాథరెడ్డి గతంలో టమోటా పంట సాగు చేసి నష్టపోయాడు. తోటి రైతులు సలహా ఇవ్వడంతో తమిళనాడు నుంచి కిలో రూ.13వేలు వెచ్చించి అవతార్ రకం ఔషధ చిన్న ఉల్లిగడ్డల విత్తనాలు తెచ్చి నారు పోశాడు. 40 రోజుల తర్వాత నారును ఒకటిన్నర ఎకరం పొలంలో నాటించగా 85 రోజుల తర్వాత పంట దిగుబడి ప్రారంభమైంది. పొలంలో కలుపు లేకుండా చూసుకొని నారు ఎదుగుదలకు ఒక్కసారి యూరియా, డీఏపీ వంటి ఎరువులు వేశాడు. భూమి స్వభావాన్ని బట్టి డ్రిప్పుల ద్వారా నీటిని అందించాడు. విత్తనాలు కొనడం దగ్గర నుంచి కూలీలు, పంట దిగుబడి చేతికొచ్చే వరకు ఎకరాకు రూ.80 నుంచి 90వేలు వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు చెబుతున్నాడు. ఎకరాకు 10 నుంచి 11 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడి నేల, వాతావరణానికి ఈ రకం ఉల్లిసాగు మంచి దిగుబడితో నికర ఆదాయం పొందవచ్చునని చెబుతున్నారు.
శ్రీలంక, మలేషియాకు ట్రాన్స్‌పోర్ట్
అవతార్ రకం ఔషధ ఉల్లిగడ్డలు రెండు నుంచి నాలుగు పాయలుగా ఉండి లేత ఎరుపు రంగులో ఉంటాయి. కోసేటప్పుడు కొంచెం ఘాటు ఉంటుంది. ఔషధ గుణాలు కలిగి ఉండటంతో మందులతోపాటు వంటలకు కూడా వాడవచ్చని రైతు చెబుతున్నాడు. విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే తోట దగ్గరకు వచ్చి నాణ్యతను బట్టి కిలోకు రూ.30 నుంచి రూ.35తో పంటను కొనుగోలు చేస్తున్నారు. పంటను తమిళనాడుకు తరలించి అక్కడి నుంచి శ్రీలంక, మలేషియా, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు.
తక్కువ పంట కాలంలో నికర ఆదాయం
ఒకటిన్నర ఎకరంలో ఉల్లి సాగు చేశాను. ఇక్కడి నేల, వాతావరణం అనుకూలించడంతో 11 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా వ్యాపారులే తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి పోను రూ.3లక్షల వరకు ఆదాయం వస్తుందని అనుకుంటున్నా.
- అమరనాథరెడ్డి, రైతు