సాగు.. బాగు
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:45 AM
జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు రెట్టింపైన పంటల విస్తీర్ణం అన్నదాత మోమున ఆనందం
మదనపల్లె టౌన్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గతేడాది వర్షాలు విస్తారంగా కురిశాయి. మరోపక్క హంద్రీనీవా జలాలతో చెరువులు పూర్తిగా నిండాయి. భూగర్భ జలాలు 8.7 మీటర్ల మేర పెరిగాయి. ఫలితంగా రబీ సీజన్‌లో సాగు సాధారణం కన్నా రెట్టింపయ్యింది. వివిధ పంటలతో పొలాలు పచ్చదనం పరుచుకున్నాయి. రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.
జిల్లాలో గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే వర్షపాతం సాధారణం కన్నా అధికంగానే నమోదైంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం 380.1 మి.మీ. కాగా 462.9మి.మీ నమోదైంది. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో సాధారణ వర్షపాతం 288.1 మి.మీ కాగా, 357.1 మి.మీ నమోదైంది. దీంతో జిల్లాలోని చిన్న కుంటల నుంచి పెద్దచెరువులు, ప్రాజెక్టులు నిండు కుండలను తలపించాయి. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని మండలాల్లో, అన్ని రకాల పంటలు కలిపి సాధారణ సాగు 27,679 హెక్టార్లు ఉండగా, ఈ రబీ సీజన్‌లో 44,854 హెక్టార్లలో దాదాపు రెట్టింపుగా సేద్యం చేస్తున్నారు. ముఖ్యంగా వరి సాధారణ సాగు 6,355 హెక్టార్లు ఉండగా 7,402 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న 651హెక్టార్లలో సాధారణ సాగు ఉండగా, 1,497 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఉలవ పంట 10,241 హెక్టార్లకు గాను 17,298 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వేరుశనగ 8,645 హెక్టార్లకు గాను 9,907 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అన్నదాతల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది.
రెండేళ్లు కరువు.. రెండేళ్లు లోటు వర్షపాతం
వైసీపీ పాలనలో 2021-22, 2022-23 ఖరీఫ్, రబీ సీజన్ సీజన్లలో ఎక్కువ మండలాల్లో కరువు తాండవించింది. అన్ని పంటలు సాధారణం కంటే దిగువన సాగయ్యాయి. చాలా ప్రాంతాల్లో సాగునీరు లేక పొలాలను బీళ్లు పెట్టేశారు. 2023-24, 2024-25 రబీ సీజన్‌లో కూడా తక్కువ వర్షాలతో సాధారణ సాగు లక్ష్యాన్ని రైతులు చేరుకోలేకపోయారు.
జిల్లా ర్యాంకు పెరిగే అవకాశం
2025-26 ఆర్థిక సంవత్సరంలో రబీ సీజన్‌లో జిల్లాలో రెట్టింపు స్థాయిలో పంటలు సాగవుతున్నాయి. అన్నీ కలసివచ్చి దిగుబడి పెరిగితే జిల్లా జీడీపీ పెరుగుతుంది. ఇదే జరిగితే వచ్చే మూడు నెలల తర్వాత సీఎం చంద్రబాబు నిర్వహించే కలెక్టర్ల సదస్సులో జిల్లా ర్యాంకు పెరిగే ఆస్కారముంది.