Share News

సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా ‘సీ-సేఫ్‌’

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:50 AM

ఎక్కువ మంది గర్భిణులు పురిటి నొప్పుల భయం, ఇతరత్రా కారణాలతో సిజేరియన్ల వైపు మొగ్గుచూపుతున్నారు

సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా ‘సీ-సేఫ్‌’
తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి

తిరుపతి సెంట్రల్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎక్కువ మంది గర్భిణులు పురిటి నొప్పుల భయం, ఇతరత్రా కారణాలతో సిజేరియన్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సహజ ప్రసవాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం సీ-సేఫ్‌ (సేఫ్‌ సర్జికల్‌) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి దశలో తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి నుంచి అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సీ-సే్‌ఫను ఆరు నెలలుగా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, తణుకు ప్రభుత్వాస్పత్రుల్లో అమలు చేస్తున్నారు.

స్టాఫ్‌ నర్సులు, గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ

సీ-సేఫ్‌ కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహించడానికి స్టాఫ్‌ నర్సులు, గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా మాతా శిశు మరణాలు తగ్గించడంతోపాటు వైద్య సేవల్లో నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నారు.

సీ-సేఫ్‌ డెలివరీలపై ఆడిట్‌

తల్లీబిడ్డ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా సీ-సేఫ్‌ డెలివరీలపై ఆడిట్‌ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రిలో వంద శాతం సాధారణ ప్రసవాలు జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

సాధారణ ప్రసవాలు 60శాతం కంటే ఎక్కువ జరగాలి

జిల్లా వ్యాప్తంగా సీ-సేఫ్‌ కార్యక్రమం సమర్ధవంతంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ఆస్పత్రుల్లో 60 శాతానికి మించి సాధారణ ప్రసవాలు జరగాలి. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 35 నుంచి 40 శాతం కంటే తక్కువగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇకపై తనిఖీలు చేసి.. ప్రతి నెలా డెలివరీలకు సంబంధించి నివేదికలు తెప్పించుకుని జిల్లాలో సీ-సేఫ్‌ కార్యక్రమం 100 శాతం అమలయ్యే చర్యలు తీసుకుంటాం.

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాలకృష్ణ నాయక్‌

Updated Date - Nov 13 , 2026 | 12:50 AM