రిజిస్ట్రేషన్ కమీషన్లపై కీలక ఆధారాలు!?
ABN , Publish Date - Aug 19 , 2026 | 02:08 AM
తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కమీషన్ల వసూళ్ల విషయంలో ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఏసీబీ ఆకస్మిక తనిఖీలు రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొనసాగాయి. పలు రికార్డులు, డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించినట్లు సమాచారం.
తిరుపతి(సిటీ/నేరవిభాగం), ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కమీషన్ల వసూళ్ల విషయంలో ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఏసీబీ ఆకస్మిక తనిఖీలు రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొనసాగాయి. పలు రికార్డులు, డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించినట్లు సమాచారం.
22-ఏ భూములపైనా ఆరా
అక్కారంపల్లె, తిరుపతి, చింతలచేను ప్రాంతాలకు చెందిన 22-ఏ నిషేధిత భూముల సర్వే నెంబర్లు, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. 22ఏ భూముల రిజిస్ట్రేషన్లలో నిబంధనలు పాటించారా? వాటికి సంబంధించిన లావాదేవీల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ప్రైవేటు అటెండర్ కీలకం
సబ్ రిజిస్ట్రార్ బి.లక్ష్మీదేవికి పర్సనల్ అటెండర్‌గా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి మేఘనాథ్‌రెడ్డి అక్రమ వసూళ్లలో కీలక వ్యక్తిగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టిన సమయంలో కార్యాలయంలోనే ఉన్న చంద్రగిరికి చెందిన మేఘనాథ్‌రెడ్డి వద్ద రూ.2.48 లక్షల నగదు లభించిన విషయం తెలిసిందే. ఇతను సబ్ రిజిస్ట్రార్ వద్ద అటెండర్ తరహాలో వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది.
ఫోన్‌పేలో లావాదేవీలు.. కమీషన్ స్లిప్పుల గుర్తింపు
మేఘనాథ్ ఫోన్‌పే ఖాతాను అధికారులు పరిశీలించగా పలువురు డాక్యుమెంట్ రైటర్లతో జరిగిన నగదు లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు ఏయే భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో సంబంధ ఉందనే విషయాలను నిగ్గు తేల్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఓ చిన్న గదిలో మేఘనాథ్‌రెడ్డి దాచిఉంచిన 50కుపైగా స్లిప్పులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జూన్ 14వ తేదీనుంచి రోజువారీగా ఏరోజు ఏ డాక్యుమెంట్లకు సంబంధించిన కమీషన్ మొత్తాల వివరాలు ఆ స్లిప్పుల్లో నమోదు చేసి భద్రపరిచినట్టు గుర్తించినట్లు తెలిసింది. ఆ వివరాలను కార్యాలయ రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సరిపోల్చి పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కుమారుడి ఖాతాకూ నగదు బదిలీ?
సబ్ రిజిస్ట్రార్ కుమారుడి ఖాతాకు కూడా మేఘనాథ్ ఖాతా నుంచి కొన్ని విడతలుగా నగదు బదిలీ అయినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయి? వాటికి కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలోనూ ఏసీబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సబ్ రిజిస్ట్రార్ వద్ద మేఘనాథ్‌తోపాటు మరో ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల సమయంలో వారు అందుబాటులో లేకపోవడంతో వివరాలను సేకరించి, వారి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
రికార్డుల పరిశీలన.. ప్రభుత్వానికి నివేదిక
రెండ్రోజుల సోదాల్లో స్వాధీనం చేసుకున్న రికార్డులు, రిజిస్టర్లు, డాక్యుమెంట్లు, స్లిప్పులు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు తమ కార్యాలయానికి తరలించి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల వివరాలను కూడా విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. సోదాల్లో సేకరించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.