వాటర్ ప్లాంట్లకు అనధికారిక విద్యుత్ వాడకంపై కొరడా
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:57 AM
ఎస్పీడీసీఎల్ పరిధిలో వాటర్ ప్లాంట్లకు అనధికారికంగా విద్యుత్తును వినియోగిస్తున్నారని అందిన ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని సంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు.
-ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్
తిరుపతి సిటీ, మార్చి23(ఆంధ్రజ్యోతి): ఎస్పీడీసీఎల్ పరిధిలో వాటర్ ప్లాంట్లకు అనధికారికంగా విద్యుత్తును వినియోగిస్తున్నారని అందిన ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని సంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు. సదరన్ డిస్కం కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో కడప జిల్లా జమ్మలమడుగువాసి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నిర్వహిస్తున్న రెండు వాటర్ ప్లాంట్లు రూ. లక్షల్లో విద్యుత్ బిల్లుల బకాయి పడ్డాయని,సర్వీసులను డిస్కనెక్ట్ చేసినప్పటికీ అనధికారికంగా విద్యుత్తును వినియోగించుకుంటున్నారని తెలియజేశారు.సీఎండీ స్పందిస్తూ సంస్థకు నష్టం కలిగించే ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని, సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.సంస్థ అధికారులు, సిబ్బంది పనితీరు, ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదులందుతున్నాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. సుమారు 50 మంది వినియోగదారులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.