తిరుపతిలో కోవిడ్ కలకలం
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:19 AM
తిరుపతిలో సోమవారం కరోనా కేసు బయటపడడం కలకలం రేపింది.
తిరుపతి సెంట్రల్, జూలై 27(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో సోమవారం కరోనా కేసు బయటపడడం కలకలం రేపింది. నగరానికి చెందిన 65 సంవత్సరాల మహిళ వారం రోజులుగా జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఆమెను 20వ తేది కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.బీపీ, షుగర్, టీబీలతో బాధపడుతున్న ఆమెను పరీక్షించిన వైద్యులు అనుమానంతో కరోనా పరీక్ష కోసం 23న శాంపుల్ తీసి చెన్నైకి పంపారు.అక్కడి ల్యాబ్ సిబ్బంది ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు 24న వెల్లడించారు.డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌కు సమాచారమందడంతో ఐసోలేషన్ వార్దులో వుంచి చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత మెరుగ్గా వుందని, త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్లు డీఎంహెచ్‌వో వెల్లడించారు.ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ రావడంతో వైద్యారోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. కరోనా విషయంలో భయాందోళన అవసరంలేదని, అయితే నిర్లక్ష్యం మాత్రం ప్రమాదకరమని డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.