మళ్లీ కొవిడ్ అలర్ట్...!
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:35 AM
ఏపీలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పక్క జిల్లా అయిన కడపలో ఇటీవల ఐదు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. దీంతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తవుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి గతంలోలాగా తీవ్రంగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తిరుపతి, కడప జిల్లాల్లో 5 కేసుల నమోదు
వేరియంట్ నిర్ధారణ కోసం పూణెకు నమూనాలు
భయపడాల్సి పని లేదు
అప్రమత్తంగా ఉంటే చాలు
చిత్తూరు రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఏపీలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పక్క జిల్లా అయిన కడపలో ఇటీవల ఐదు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. దీంతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తవుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి గతంలోలాగా తీవ్రంగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనవసరంగా భయపడకుండా, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కొన్ని జాగ్రతలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని సమర్థంగా అరికట్టవచ్చని సూచిస్తున్నారు.
లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు
జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట, వాసన లేదా రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వాస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఈ జాగ్రతలు తప్పనిసరి
ఫ చేతులను తరచూ సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి
ఫ దగ్గు, జలబు లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలి
ఫ జన సంచార ప్రాంతాల్లో వృద్ధులు, గర్భిణులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మాస్క్ ఉపయోగించడం మంచిది.
ఫ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు, నోటిని రుమాలు లేదా మోచేతితో కప్పుకోవాలి
ఫ గదుల్లో గాలి సరిగా వచ్చేలా చూడాలి
ఫ జ్వరం వచ్చినప్పుడు కార్యాలయాలు, పాఠశాలలు లేదా జనం అధిక ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలి.
ఎక్కువ ఆప్రమత్తంగా ఉండాల్సింది ఎవరంటే?
మధుమేహం, రక్తపోటు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు. వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
భయపడాల్సిన అవసరం లేదు
ప్రస్తుతం వస్తున్న వేరియంట్ అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రజల్లో ఇమ్యూనిటీ బాగా పెరిగిందని, కొవిడ్‌ను తట్టుకొనే శక్తి బాగా పెరిగిందంటున్నారు. కడప జిల్లాలో నమోదైన ఐదు కేసుల్లో అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలుపుతున్నారు.
పూణెకు కొవిడ్ బాధితుల శాంపిల్స్
కొవిడ్ బారిన పడిన ఐదుగురి శాంపిల్స్‌ను అధికారులు పూణెలోని ల్యాబ్‌కు పంపించనున్నారు. కొవిడ్ వేరియంట్, దాని యొక్క ప్రభావం ఎంత అని తెలుసుకునేందుకు పరీక్షలు చేయనున్నారు. ఈ పరీక్షలతో ఆ వేరియంట్ యొక్క ప్రభావం తెలుసుకుంటే దాని కట్టడిని తెలుసుకోవచ్చునని నిపుణుల అంచనా.
రాపిడ్ కిట్లు ఎక్కడ...?
కొవిడ్‌ను ప్రస్తుతం సాధారణ శ్వాసకోశ వైరల్ వ్యాధుల జాబితాలోనే డబ్ల్యూహెచ్‌వో పరిగణించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. దీంతో అనుమానితులకు ప్రాథమిక స్థాయిలోనే పరీక్షలు చేసి అవసరమైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అయితే చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం కొవిడ్ రాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవని సమాచారం. దీంతో లక్షణాలతో వచ్చే వారికి తక్షణ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. దీనిపై వైద్యఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.
రుయాస్పత్రిలో అప్రమత్తం
తిరుపతి సిటీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): మళ్లీ కొవిడ్ పాజిటివ్ నేపథ్యంలో తిరుపతిలోని రుయాస్పత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. ఐసొలేషన్ వార్డు సిద్ధం చేశారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి (52) తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ గత నెల 24న వేలూరు సీఎంసీలో చేరారు. నిమోనియా వ్యాధిగా గుర్తించారు. అనుమానంతో కొవిడ్ పరీక్ష చేయగా 26వ తేది పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూ 28న మృతిచెందడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. దీనిపై ఆరా తీయగా 5 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు గుర్తించింది. దీంతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు బుధవారం లేఖలు రాశారు. కొవిడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్లు, మందులు, ర్యాపిడ్ కిట్లు, అంబులెన్స్ వంటి వైద్య సిబ్బంది వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అవసరమైతే వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులకు సూచించినట్టు సమాచారం.
అప్రమత్తంగా ఉన్నాం
కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డీఎంఈ ఆదేశిచ్చారు. రుయాలో కొవిడ్ ఐసోలేషన్ వార్డు ఏర్పాటుచేశాం. కొవిడ్ టెస్ట్ కిట్లు, సిబ్బంది, అవసరమైన మందులతో సిద్ధంగా ఉన్నాం. రుయాలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదుకాలేదు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో తీవ్రమైన లక్షణాలు లేవని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాం.
- డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్, రుయాస్పత్రి
ఆందోళన వద్దు.. అశ్రద్ధ వద్దు
కరోనాతో గతంలో లాగా భయపడాల్సిన పనిలేదు. వాతావరణంలో మార్పుల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గినవారు అశ్రద్ధ చేయకూడదు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- డాక్టర్ సుబ్బారావు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, రుయాస్పత్రి