Share News

పెళ్లి మండపంలో జంట హత్యలు

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:31 AM

శుభమా అని పెళ్లి జరుగుతుంటే కొందరు దుండగులు పెళ్లి మండపంలోనే కత్తులతో దాడిచేసి రక్తపాతం సృష్టించారు. పెళ్లిమండపం ఆవరణలోనే ఇద్దరు వ్యక్తులను దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీపురం సర్కిల్‌ సమీపంలో వున్న పద్మావతి కల్యాణ మండపం ఆవరణలో చోటుచేసుకుంది.

పెళ్లి మండపంలో జంట హత్యలు
మునిరత్నం యాదవ్‌ (ఫైల్‌ ఫొటో)

ఫకత్తులతో దాడి చేసి ఇద్దరిని పొట్టనబెట్టుకున్న దుండగులు

తిరుపతి(నేరవిభాగం), జూలై 8 (ఆంధ్రజ్యోతి): శుభమా అని పెళ్లి జరుగుతుంటే కొందరు దుండగులు పెళ్లి మండపంలోనే కత్తులతో దాడిచేసి రక్తపాతం సృష్టించారు. పెళ్లిమండపం ఆవరణలోనే ఇద్దరు వ్యక్తులను దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీపురం సర్కిల్‌ సమీపంలో వున్న పద్మావతి కల్యాణ మండపం ఆవరణలో చోటుచేసుకుంది.ఈస్ట్‌ సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం... ఏర్పేడు మండలం గొల్లపల్లెకు చెందిన ఓ కుటుంబానికి సంబంధించిన వివాహం బుధవారం రాత్రి పద్మావతి కల్యాణ మండపంలో జరిగింది. ఈ వేడుకకు గొల్లపల్లెకు చెందిన మునిరత్నం యాదవ్‌ (41), తిరుపతి సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన ఆయన స్నేహితుడు మణికంఠ (35) హాజరయ్యారు. మునిరత్నం ప్రస్తుతం తిరుపతి జీవకోనలో ఉంటూ తిరుమలలో చిరు వ్యాపారం నిర్వహిస్తుండగా, మణికంఠ జీప్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కల్యాణ మండపం ఆవరణలో ఉన్న మునిరత్నం, మణికంఠపై కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా కత్తులతో దాడికి దిగారు.కత్తిపోట్లతో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మణికంఠను స్థానికులు 108 అంబులెన్స్‌లో హుటాహుటిన రుయాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి సుమారు 11.15 గంటలకు మృతి చెందాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఐదుగురు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు ద్విచక్ర వాహనాలపై నిందితులు కళ్యాణ మండపానికి చేరుకున్నట్లు గుర్తించారు. ఒక బైక్‌పై ముగ్గురు పురుషులు, మరో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు, వారిలో ఒక మహిళ ఉన్నట్టు సమాచారం. దాడి అనంతరం అందరూ అక్కడి నుంచి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఈస్ట్‌ సీఐ శ్రీనివాసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

కుటుంబ వివాదమే కారణమా !

జంట హత్యల వెనుక కుటుంబ వివాదమే కారణంగా తెలుస్తోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లెకు చెందిన సునీల్‌, అతని తమ్ముడు, అక్కతో పాటు మరో బంధువు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను కొన్నేళ్ల క్రితం సునీల్‌ వివాహం చేసుకోగా, కొద్ది నెలల క్రితం ఎలాంటి కారణాలు చెప్పకుండానే సునీల్‌ భార్యను వదిలేసినట్టు సమాచారం. బుధవారం రాత్రి వివాహానికి సునీల్‌ వస్తున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ ఈ విషయాన్ని తన కుమార్తెకు దగ్గరుండి పెళ్లి చేసిన మునిరత్నం, మణికంఠలకు తెలియజేసింది. దీంతో పెళ్లి మండపంలో సునీల్‌ను కలిసి భార్యను ఎందుకు వదిలేశావంటూ వారు నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిమధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని సునీల్‌ ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో సునీల్‌ తండ్రి, తమ్ముడు, అక్క హుటాహుటిన కల్యాణమండపానికి చేరుకున్నారు. వచ్చీ రాగానే సునీల్‌ తండ్రి తన వెంట సంచిలో తెచ్చుకున్న కత్తితో మునిరత్నం, మణికంఠలపై దాడి చేశాడు. ఈ ఘటనలో మునిరత్నం యాదవ్‌ అక్కడే మృతిచెందగా మణికంఠ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.

Updated Date - Jul 09 , 2026 | 01:31 AM