నడిరోడ్డుపై దంపతుల హత్య
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:48 AM
చిత్తూరు జిల్లా రామకుప్పం దారుణం
రామకుప్పం, జూలై 17(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా రామకుప్పం శివార్లలో ద్విచక్రవాహనంపై వస్తున్న దంపతులపై కత్తులతో దాడిచేసి హతమార్చారు. స్థానికులు, పోలీసుల తెలిపిన ప్రకారం.. రామకుప్పం శివారు బందార్లపల్లెకు చెందిన వెంకటేశు(65) బోరు మోటారు మెకానిక్ షాపు నిర్వహిస్తున్నారు. బందార్లపల్లెతో పాటు రామకుప్పం వైఎస్సార్ సర్కిల్ సమీపంలోనూ ఆయనకు ఇళ్లులున్నాయి. పగలంతా మెకానిక్ షాపులో ఉంటూ బందార్లపల్లెలోని ఇంట్లోనే భోంచేసేవారు. రాత్రి పూట భోజనం తర్వాత భార్యతో కలిసి రామకుప్పం వెళ్లి అక్కడి ఇంట్లో నిద్రించేవారు. ఈ క్రమంలో వెంకటేశు, పార్వతమ్మ(62) శుక్రవారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో ద్విచకవ్రాహనంలో రామకుప్పానికి బయలుదేరారు. మార్గమధ్యంలో శాంతినికేతన్ స్కూల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వీరి బైకును అటకాయించి కత్తులతో విరుచుకుపడ్డారు. వెంకటేశు మోహం, గొంతుపై నరికారు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన పార్వతమ్మ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దుండగులు ఆమెను వెంబడించి కొద్ది అడుగుల దూరంలోనే గొంతుపై నరికి చంపేశారు. కుప్పం రూరల్ సీఐ మల్లే్‌షయాదవ్, రామకుప్పం ఎస్‌ఐ వెంకటమోహన్, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యలు జరిగిన తీరునుబట్టి కిరాయి హంతకుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతులను హతమార్చింది ఒకరేనని కొందరు.. నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని ఆటోలో వచ్చి హత్యలు చేశాక అదే ఆటోలో వెళ్లారని మరికొందరు చెబుతున్నారు. ఈ హత్యకు కారణాలేంటనేది తెలియడం లేదు. దాయాదులతో ఉన్న భూసమస్యపై ఇటివలే పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి రాజీ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. భూవివాదాలా, వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం సంఘటన స్థలానికి చేరుకున్నారు.