Share News

పల్లెల్లో పేలుతున్న నాటుతుపాకులు

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:32 AM

నాటు తుపాకుల ఉద్దేశం గతి తప్పింది. క్రమేణా పల్లెల్లో హింసాత్మక ఘటనలకు వాడుతున్నారు. దీనిపై పోలీసులకూ సమాచారం రావడంతో కొన్ని నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు షికారీల వద్ద ఉన్న తుపాకులనూ విడతల వారీగా సీజ్‌ చేశారు.

  పల్లెల్లో పేలుతున్న నాటుతుపాకులు

(చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి)

ఏడాది కిందట యాదమరి మండలం మాదిరెడ్డిపల్లెలో భూ వివాదంలో రాజేష్‌, సురేష్‌ ఘర్షణ పడ్డారు. ఆవేశంలో ఇంట్లో నుంచి రాజేంద్ర నాటు తుపాకీ తీసుకొచ్చి.. సురేష్‌ మోకాలిపై కాల్చాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడ్ని కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారు.

పెద్దపంజాణి మండలం వీరపల్లె పంచాయతీలోని మార్లపల్లెకు చెందిన శ్రీనివాసులు.. గురువారం రాత్రి పొలం వద్ద నిద్రిస్తుండగా నాటు తుపాకీతో కాల్చి చంపారు. మృతదేహం పక్కనే నాటు తుపాకీ ఉంచి వెళ్లారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు మృతుడి కుటుంబీకులు చెబుతున్నారు.

గుడిపాల మండలానికి చెందిన దిలీప్‌, భరత్‌.. యాదమరి మండలంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను చంపడానికి ఈ నెల 3వ తేదీన నాటు తుపాకీతో వస్తున్నారు. వీరిని పోలీసులు పట్టుకుని రిమాండుకు తరలించారు.

వన్యప్రాణుల నుంచి రక్షణ కోసమని అటవీ సమీప గ్రామాల్లో కొందరు నాటు తుపాకులు తీసుకునేవారు. ప్రభుత్వం కూడా వీరికి లైసెన్సు ఇచ్చేది.

ఇలా తీసుకున్న నాటు తుపాకులను కాలక్రమంలో.. వన్యప్రాణులను చంపడానికే వినియోగిస్తున్నారు కొందరు.

ఇంకొందరేమో గ్రామాల్లో గొడవలు జరిగినప్పుడు నాటు తుపాకీ చూపి బెదిరిస్తున్నారు. ఒక్కోసారి కాల్పులూ జరిపి గాయపరస్తున్నారు. మరికొందరు పాత కక్షలు, ఆస్తితగాదాల్లో ఎదుటివారిని చంపుతున్నారు.

ఇలా నాటు తుపాకుల ఉద్దేశం గతి తప్పింది. క్రమేణా పల్లెల్లో హింసాత్మక ఘటనలకు వాడుతున్నారు. దీనిపై పోలీసులకూ సమాచారం రావడంతో కొన్ని నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు షికారీల వద్ద ఉన్న తుపాకులనూ విడతల వారీగా సీజ్‌ చేశారు. అయినా, పోలీసుల కళ్లుగప్పి జిల్లాలోని అటవీ సరిహద్దు గ్రామాలకు చెందిన కొంతమంది అక్రమంగా నాటు తుపాకులను తీసుకొస్తున్నారు. వీరు వన్యప్రాణులను కాల్చి చంపి.. వాటి మాంసాన్ని అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారం అటవీశాఖలో కొందరికి తెలిసే జరుగుతోందన్న విమర్శలున్నాయి. వన్యప్రాణుల వేటకోసం తీసుకొచ్చిన నాటు తుపాకులను ఒక్కోసారి గొడవల్లో వాడుతున్నారు. ఇలా నాటు తుపాకీ పేల్చి కొందరిని చంపుతున్నారు. మరికొందరిని గాయపరుస్తున్నారు. యాదమరి, గుడిపాల, బంగారుపాళ్యం, పాలసముద్రం, కుప్పం, పలమనేరు సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా నాటు తుపాకులు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది.

నాటు తుపాకీని ఎక్కడ తయారు చేస్తారంటే..?

తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం సమీప గ్రామాల్లో నాటు తుపాకులను తయారు చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. అక్కడ ఒక్కో చోట ఒక్కో విడిభాగాన్ని తయారు చేస్తారు. వాటి విడిభాగాలను కొనుక్కుని ఒక చోట అసెంబుల్‌ చేస్తారని పోలీసులు గుర్తించారు. ఇటీవల యాదమరి మండలం ఓటేరుపల్లె వద్ద పట్టుబడిన ఇద్దరు నిందితులు పోలీసుల విచారణలో ఈ విషయం వెల్లడించారు. వీటి ఖరీదు రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు ఉంటుందని నిందితులు చెప్పారు.

కొరవడిన పోలీసుల నిఘా

సాధారణంగా ఎన్నికల సమయాల్లోనే పోలీసులు రౌడీ షీటర్లు, తరచూ గ్రామాల్లో ఘర్షణ పడేవారిపై నిఘా ఉంచుతారు. స్టేషన్‌కు పిలించి కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఇలా నాటు తుపాకులు, ఇతర మారణాయుధాలు కలిగి ఉన్న వారి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడూ మాత్రం వాటిని సీజ్‌ చేస్తారు. విజిబుల్‌ పోలీసింగ్‌ పేరుతో పోలీసులు చేస్తున్న కార్డన్‌సెర్చ్‌, ఇతరత్రా కార్యక్రమాల్లో నాటు తుపాకులను కనిపెట్టలేపోతున్నారు.

ఇప్పటి వరకు 16 తుపాకుల సీజ్‌

2025వ సంవత్సరంలో 16 మందిపై 12 కేసులు నమోదు చేసి.. 12 నాటు తుపాకులను సీజ్‌ చేశారు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2026వ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిపై నాలుగు కేసులు నమోదు చేశారు. వీరి నుంచి నాలుగు నాటు తుపాకులను సీజ్‌ చేశారు. అయినా, అటవీ సమీప పల్లెల్లో ఇంకా నాటు తుపాకులు పేలుతూనే ఉన్నాయి. మనుషులు, వన్యప్రాణుల ప్రాణాలు తీస్తున్నాయి.

Updated Date - Aug 10 , 2026 | 01:32 AM