పేలిన నాటు తుపాకీ
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:38 AM
పొలాల్లో రైతు దారుణ హత్య ఆస్తికోసమే దారుణమంటున్న మృతుడి కుటుంబ సభ్యులు
పెద్దపంజాణి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): నాటు తుపాకీ పేలింది. రైతు శరీరంలోకి బుల్లెట్ దిగింది. ప్రతి రాత్రిలాగే పొలం వద్దకు వెళ్లిన శ్రీనివాసులు (50) దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణం.. శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. వీరపల్లె పంచాయతీ మార్లపల్లెకు చెందిన మేకల రెడ్డెప్పకు, అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ తల్లీ కొడుకులు తరచూ ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని రెడ్డెప్పతో గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో ఏడాది కిందట ఈ ముగ్గురూ తమిళనాడులోని దేవాలయాల సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో రెడ్డెప్ప ప్రమాదంలో మృతి చెందాడని, మృతదేహాన్ని ఊరికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అప్పటి నుంచి తమకూ ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ రెడ్డెప్ప సొంత కుమారుడు శ్రీనివాసులు(50)తో తల్లీ కొడుకులు తగాదా పడేవారు. కాగా, ప్రతి రోజు రాత్రి శ్రీనివాసులు పొలం వద్దకు వెళ్లి అక్కడే నిద్రించేవారు. అలా గురువారం రాత్రి వెళ్లారాయన. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన శ్రీనివాసులు భార్యకు రక్తపు మడుగులో భర్త కనిపించారు. ఆమె కేకలతో చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు. డీఎస్పీ ప్రభాకర్, సీఐ పరశురాముడు, ఎస్‌ఐ సురే్‌షబాబు, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పక్కనే నాటు తుపాకీ ఉంది. శరీరంలో బుల్లెట్ దిగిన ఆనవాళ్లను గుర్తించారు. నిందితులు తుపాకీతో కాల్చి శ్రీనివాసులును హత్య చేశారనే అంచనాకు వచ్చారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి వివరాలను సేకరించారు. శ్రీనివాసులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.