నేడు శ్రీకాళహస్తి పురపోరు కౌంటింగ్
ABN , Publish Date - Nov 30 , 2026 | 01:43 AM
శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సోమవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి తెలిపారు. పురపాలకసంఘం పరిధిలోని 44వార్డులకు గాను 41 కౌన్సిలర్ స్థానాల్లో ఎన్నికలు ఈ నెల 26న జరిగిన విషయం తెలిసిందే.
శ్రీకాళహస్తి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సోమవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి తెలిపారు. పురపాలకసంఘం పరిధిలోని 44వార్డులకు గాను 41 కౌన్సిలర్ స్థానాల్లో ఎన్నికలు ఈ నెల 26న జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 44 వార్డులుండగా 12, 22, 31 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 41 వార్డులతో పాటు మున్సిపల్ చైర్మన్ స్థానానికి ఎన్నిక జరిగింది. చైర్మన్ అభ్యర్థులుగా టీడీపీ నుంచి పేట బాలాజీరెడ్డి, వైసీపీ నుంచి జ్ఞానాంబవారి దాస్, కాంగ్రెస్ నుంచి నెల్లూరు గాంధీ ఇండిపెండెంట్లుగా మరో ముగ్గురు బరిలో నిలిచారు.కౌన్సిలర్ స్థానాలకు 115మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి 30మంది, బీజేపీనుంచి ఐదుగురు, జనసేన తరపున ఆరుగురు, వైసీపీ నుంచి 41మంది, కాంగ్రెస్ తరపున ముగ్గురు, సీపీఎం తరపున ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు 22మంది పోటీలో ఉన్నారు. చైర్మన్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కోసం పది టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కాకుండా మొత్తం ఐదు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కౌన్సిలర్ స్థానాలకు 24 టేబుళ్లను ఏర్పాటుచేశారు. రెండు రౌండ్లలో అన్ని వార్డుల ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేశారు.