Share News

రెండు మండలాలు మినహా పరిషత్‌ పోలింగ్‌ ప్రశాంతం

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:50 AM

తిరుపతి జిల్లాలో గురువారం మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ రెండు మండలాలు మినహా ప్రశాంతంగా ముగిసింది

రెండు మండలాలు మినహా  పరిషత్‌ పోలింగ్‌ ప్రశాంతం
-తిరుపతిలోని తుడా క్వార్టర్స్‌ వద్ద పోలీసులకు చెవిరెడ్డి వార్నింగ్‌ -చెవిరెడ్డిని వెంటాడిన పులివర్తి సుధారెడ్డి

తిరుపతి/రైల్వేకోడూరు/తిరుచానూరు/తిరుపతి(నేరవిభాగం)/, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో గురువారం మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ రెండు మండలాలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో వైసీపీ వర్గీయులు పెట్రోలుతో నింపిన ప్లాస్టిక్‌ కవర్లను రోడ్డుపై వేసి నిప్పంటించారు. ఈ ఘటనతో తలెత్తిన ఉద్రిక్తతలు వైసీపీ, కూటమి వర్గాల నడుమ ఘర్షణకు దారితీశాయి. అందులో నలుగురు గాయపడ్డారు. తిరుపతి రూరల్‌ మండలంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానీ నడుమ హైడ్రామా నెలకొంది. ఈ రెండు మండలాలు మినహా జిల్లావ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ సాఫీగా జరిగింది.

నల్లపురెడ్డిపల్లెలో వైసీపీ, కూటమి వర్గీయుల ఘర్షణ

పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో వైసీపీ బలంగా వుంది. గ్రామంలోని పోలింగ్‌ కేంద్రానికి ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లు రాలేని పరిస్థితి. అయితే కూటమి పార్టీలు అధికారంలో వున్నందున ఇతర గ్రామాల నుంచీ ఏజెంట్లు వస్తారనే ఉద్దేశంతో వారు రాకుండా భయభ్రాంతులకు గురి చేయాలని గురువారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో వైసీపీ వర్గీయులు పెట్రోలుతో నింపిన ప్లాస్టిక్‌ కవర్లను పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో రోడ్డుపై వేసి నిప్పంటించారు. దాంతో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు నల్లపురెడ్డిపల్లె చేరుకోగా ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్ళు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఇందులో కూటమి వైపు ఇద్దరు, వైసీపీ వైపు ఇద్దరు చొప్పున నలుగురు గాయపడ్డారు. పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. రెండు వైపుల నుంచీ అందిన ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. కాగా అదే నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం పెద్దఓరంపాడు గ్రామానికి బయటి ప్రాంతాల నుంచీ వచ్చిన 15 మంది యువకులను గుర్తించి వైసీపీ నేతలు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తిరుపతి నుంచీ వచ్చినట్టు గుర్తించి సాయంత్రం తర్వాత విడిచిపెట్టారు. రైల్వే కోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీ గంగరాజపురం పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ ఏజంట్లను కూర్చోనివ్వడం లేదని ఆ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి అంబటి మురళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చెవిరెడ్డి, నానీ పోటాపోటీ ధర్నాలు

తిరుపతి రూరల్‌ మండలంలో గురువారం రోజంతా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానీ నడుమ హైడ్రామా నడిచింది. తిరుపతి రూరల్‌లో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా చెవిరెడ్డి చిన్న కుమారుడు హర్షిత్‌రెడ్డి బరిలో వుండడంతో చెవిరెడ్డి, ఆయన తనయులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌ రెడ్డి రోజంతా ఆ మండలంలోనే మకాం వేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి సుధారెడ్డి, కుమారుడు వినీల్‌ కూడా చెవిరెడ్డికి పోటీగా ఇదే మండలంలో మకాం వేశారు. వీరు మండలంలోని పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తారసపడ్డారు. ఆ క్రమంలో ఉదయం మంగళంలోని సప్తగిరి కాలనీ పోలింగ్‌ కేంద్రం వద్ద జనరల్‌ ఏజెంట్‌గా ఉన్న చెవిరెడ్డి ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తుండగా టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. అదే సమయంలో ఎమ్మెల్యే నాని అక్కడికి చేరుకుని చెవిరెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్‌ ఏజెంట్‌గా పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించవచ్చని, అయితే పోలింగ్‌ కేంద్రంలోనే ఉండి ఓటర్లను ఓట్లు అడగడం ఏమిటని ప్రశ్నించారు. పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చి పరిశీలించే హక్కు తనకు ఉందంటూ చెవిరెడ్డి బదులిచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చెవిరెడ్డి అనుచరుడు జరుగుతున్న పరిణామాలను వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కాసేపటికి ఎమ్మెల్యే వెళ్ళిపోగా ఆయన సతీమణి సుధారెడ్డి అక్కడకు చేరుకున్నారు. అక్కడినుంచీ వెళ్ళిపోవాలని పోలీసు అధికారులు కోరడంతో ఆమె చెవిరెడ్డి వెళితే తప్ప తాను వెళ్ళనంటూ భీష్మించారు. తరువాత రణధీరపురం, న్యూమంగళం, తిరుమలనగర్‌ పోలింగు కేంద్రాల వద్దకు చెవిరెడ్డి వెంట ఆమె కూడా వెళ్లారు. చెవిరెడ్డి ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకెళ్లగా సుధారెడ్డి మాత్రం ఆయన కొడుకును గెలిపించుకోవడానికి ఇలా తిరుగుతున్నాడని, తాము మాత్రం గ్రామాల అభివృద్ధి కోసం తిరుగుతున్నామన్నారు.తరువాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంట పోలింగ్‌ కేంద్రంలో పక్క గ్రామమైన ఉప్పరపల్లె నుంచీ టీడీపీ ఏజంట్లు వచ్చి కూర్చోవడంతో చెవిరెడ్డి వారిని బయటకు పంపించేశారు. సమాచారమందుకున్న ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి అక్కడకు చేరుకుని తిరిగి ఏజంట్లను పోలింగ్‌ కేంద్రంలో కూర్చోబెట్టారు.చెవిరెడ్డి వర్గీయులు తుమ్మలగుంట గ్రామంలో రిగ్గింగ్‌ చేశారని, అక్కడ రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా ఛైర్మన్‌ దివాకర్‌రెడ్డి, టీడీపీ శ్రేణులు తిరుచానూరు జడ్పీ హైస్కూలు పోలింగ్‌ కేంద్రం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. సాయినగర్‌ పంచాయతీలో ఓ టీడీపీ కార్యకర్త గదిలో పదిమందికి పైగా విద్యార్థులు వుండడంతో చెవిరెడ్డి వచ్చి వారిని గదిలో నుంచీ పంపించేశారు. దీనిపై టీడీపీ వర్గీయులు చెవిరెడ్డితో గొడవకు దిగగా పోలీసులు వచ్చి సర్దుబాటు చేశారు. వేదాంతపురంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌ శ్రేణులతో కలసి రోడ్డుపై బైఠాయించారు. మంగళం ట్రెండ్స్‌ పాఠశాల ఎదుట చెవిరెడ్డి ధర్నా చేస్తారనే సమాచారంతో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు, ఎమ్మెల్యే నానీ కుమారుడు వినీల్‌ అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చెవిరెడ్డి వస్తే తాము చూసుకుంటామని పోలీసులు వారికి నచ్చజెప్పి బలవంతంగా అక్కడ నుంచీ పంపించేశారు. కాసేపటికే చెవిరెడ్డి వచ్చి అక్కడ బైఠాయించి ధర్నాకు దిగారు. ఇలా రోజంతా తిరుపతి రూరల్‌ మండలంలో చెవిరెడ్డి, ఎమ్మెల్యే నానీ వర్గాల నడుమ హైడ్రామా నడిచింది.గూడూరు నియోజకవర్గం చిట్టమూరు, సూళ్ళూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో బ్యాలెట్‌ పత్రాలపై ఓటు ముద్రించే రబ్బర్‌ స్టాంప్‌పై స్వస్తిక్‌ గుర్తు ఊడిపోవడంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది.సత్యవేడు మండలం మల్లవారిపాలెం ఈస్ట్‌ గ్రామానికి చెందిన 250కి పైగా ఓట్లు పొరుగు గ్రామమైన చెంగంబాకం పోలింగ్‌ కేంద్రానికి మారిపోయాయి. ఆ పోలింగ్‌ కేంద్రం 4 కిలోమీటర్ల దూరంలో వుండడంతో మల్లవారిపాలం ఈస్ట్‌ గ్రామస్తులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. అనంతరం అధికారులు సర్దిచెప్పడంతో శాంతించారు. మధ్యాహ్నం తర్వాత చెంగంబాకం వెళ్ళి ఓట్లు వేశారు.

Updated Date - Nov 06 , 2026 | 12:50 AM