Share News

తుడాలో ‘అవినీతి‘ పుట్టలు బద్దలు

ABN , Publish Date - May 16 , 2026 | 01:28 AM

తుడాలో ప్రతి విభాగంపై ఏసీబీ పరిశీలన నెల రోజుల్లో పూర్తికి విచారణ వేగవంతం

తుడాలో ‘అవినీతి‘ పుట్టలు బద్దలు

తిరుపతి(టీటీడీ), మే 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తుడాలో జరిగిన అవినీతి పుట్టలు బద్దలవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం తుడాలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ నిర్వహించగా ఇప్పుడు ఏసీబీ అధికారులు అక్కడ జరిగిన అడ్డగోలు వ్యవహారాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రతి విభాగంలో జరిగిన లావాదేవీలు, పనులపై పరిశీలన ముమ్మరం చేశారు. నెల రోజుల వ్యవధిలో విచారణను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో వైసీపీ హయాంలో రూ.702 కోట్లకు పైగా విలువైన సుమారు 845 పనులకు టెండర్లు పిలిచారు. ఇందులో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తొలుత విజిలెన్స్‌ విచారణ నిర్వహించింది. అయితే మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలోనే తుడా అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేసి అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని పేర్కొంటూ సుమారు 15 అంశాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు లేఖలు వచ్చాయి. దీంతో ఏప్రిల్‌లో ఏసీబీ అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు. నాడు జరిగిన ప్రతి పనికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు. ఇంజనీరింగ్‌ పనులతోపాటు లేఅవుట్లు, పార్కుల నిర్మాణం, తుడా టవర్స్‌, చెరువుల అభివృద్ధి ఇలా అన్ని అంశాలపై విచారిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారుల నివేదికను పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు తమకు అవసరమైన సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవలే వైసీపీ హయాంలో వేసిన లేఅవుట్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా జరిగింది, ఆన్‌లైన్‌లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయా అనే అంశాలను పరిశీలించారు.అదేవిధంగా తుమ్మలగుంటలో నిర్మించిన స్టేడియం, అక్కడే నిర్మించిన కేవీఎస్‌ పార్కుకు సంబంధించి పనుల లావాదేవీలను తుడా అకౌంట్స్‌ విభాగం నుంచి తీసుకున్నారు.

ఇంజనీరింగ్‌ విభాగంలోనే.....

ఇంజనీరింగ్‌ విభాగంలోనే పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు. గతంలో బెంచీల నిర్మాణానికి సంబంధించి తొలుత ఒక్కో దాన్ని సుమారు రూ.7వేలకు అప్పగించేలా గుత్తేదారుకు పనులు అప్పగించగా ఆ తర్వాత ఏకంగా రూ.11వేల దాకా కట్టబెట్టారు. ఇందులో పెద్దఎత్తున ఆరోపణలు వినిపించాయి. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో భారీసంఖ్యలో బెంచీలను ఏర్పాటు చేశారు. ఇందులో జరిగిన అక్రమాలపైనా విచారణ చేస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచినా కేవలం ఒకే సంస్థకు చెందిన గుత్తేదారుకు పనులు అప్పగించారన్న ఆరోపణలపైనా విచారిస్తున్నారు. ఇందుకోసం విభాగాల వారీగా ఎన్ని పనులకు టెండర్లు పిలిచారు, ఎంతమంది గుత్తేదారులు పాల్గొన్నారు, ఎవరెవరికి పనులు కట్టబెట్టారు అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

Updated Date - May 16 , 2026 | 01:28 AM