దర్యాప్తునకు సహకరించండి
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:28 AM
ఆమోదం పొందిన లేఅవుట్‌లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా మామిడి చెట్లు తొలగించి సొంత భూమికి రోడ్డు ఏర్పాటు చేసుకున్న వ్యవహారంపై నమోదైన కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను హైకోర్టు ఆదేశించింది.
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఆమోదం పొందిన లేఅవుట్‌లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా మామిడి చెట్లు తొలగించి సొంత భూమికి రోడ్డు ఏర్పాటు చేసుకున్న వ్యవహారంపై నమోదైన కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను హైకోర్టు ఆదేశించింది. ఆధారాలను దర్యాప్తు అధికారి ముందుంచాలని స్పష్టం చేసింది.వారిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లె పరిధిలో సర్వే నెం.478లోని అప్రూవ్డ్ లేఅవుట్‌లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా, యంత్రాలతో మామిడి చెట్లను తొలగించి, సొంత భూమికి రోడ్డు నిర్మించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గతనెల 22న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భూమన, ఆయన సతీమణి రేవతి, కుమారుడు అభినయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.