కూలిప్స్ మరో మత్తు భూతం
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:30 AM
విద్యాసంస్థల సమీపాల్లో అమ్మకాలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అక్రమార్కులు రెండేళ్లలో 2513 కేసుల నమోదు
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరంలో ఓ పెద్ద విద్యా సంస్థ ఉంది. ఎల్‌కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు నడుపుతున్నారు. ఇటీవల తరగతి గదులు, మరుగుదొడ్లను స్వీపర్ శుభ్రం చేస్తుంటే రెండు మూడు కిలోల వరకు కూలిప్స్ ముక్కలు, సిగరెట్ ముక్కలు దొరికాయి. విద్యార్థులను గట్టిగా హెచ్చరించినా పట్టించుకోవడం లేదని ఆ కరస్పాండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరో డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థి కూలి్‌ప్సకు అలవాటు పడ్డాడు. ఆ మత్తులో ఏమి మాట్లాడతాడో అతడికే తెలియడం లేదు. అప్పటి వరకు బాగా చదువుకుంటున్న కొడుకు ఇలా అయ్యాడని తల్లిదండ్రులు కుమిలిపోయారు. కళాశాల యాజమాన్యంతో కలిసి డీ అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అతడి పరిస్థితి మెరుగుపడుతోందని ఆ కళాశాలలోని ఓ లెక్చరరు చెప్పారు.
ఇలా మత్తులో ముంచే ‘కూలి్‌ప్స’ను విద్యార్థులకు అలవాటు చేస్తూ, వారి జీవితాలతో ఆటలాడే ముఠాలు పెరిగిపోయాయి. డబ్బు సంపాదన కోసం రేపటి తరాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి.
పాఠశాల, కళాశాల స్థాయి నుంచే కొంత మంది విద్యార్థులు చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారు. తొలిగా స్నేహితులతో కలిసి సరదాగా తీసుకునే మత్తు పదార్థాలు.. అలవాటుగా మారిపోతోంది. ఇది వరకు ఖైనీలు, సిగరెట్లు, గుట్కా, మత్తు కలిగించే ఇతర పొగాకు వస్తువులను విద్యాసంస్థల సమీపాల్లో అమ్మేవారు. ఇటీవల కూలిప్స్ రూపంలో మరో మత్తు భూతం జడలు విప్పింది. ఇది వరకు పెద్ద నగరాలకే పరిమితమైన కూలిప్స్.. ఇప్పుడు పట్టణాలు, మండల కేంద్రాలకూ విస్తరించింది.
రాష్ట్రంలో ఖైనీ, గుట్కా, పాన్‌పరాగ్‌లు నిషిద్ధం. వీటినే కొంత మంది వ్యాపారులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మార్గంలో చిత్తూరుకు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. గత నెలలో చిత్తూరు కేంద్రంగా ఓ ఇంటి నుంచి లక్షలాది రూపాయల విలువైన ఖైనీ, పాన్‌పరాగ్‌లను షాపులకు అమ్మడానికి కార్లలో తీసుకెళుతుంటే ఇరువారం, గుడిపాల పరిధిలో పట్టుకున్నారు. ప్రస్తుతం కూలిప్స్(నోటిలో పెట్టుకుంటే కనపడని విధంగా స్పాంజ్‌లో ఉంటుంది) జిల్లాలో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. వీటిని బెంగళూరు, ముళ బాగిల్, కోలార్ ప్రాంతాల నుంచి కూరగాయల వ్యాన్లు, చిన్నపాటి లగేజీ వ్యాన్లలో తీసుకొస్తున్నారు. ఒక్కో పీస్‌ను రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముతున్నారు. ఒక్క పీస్‌ను నోటిలో పెట్టుకుంటే రెండు మూడు గంటల వరకు మత్తులో ఉంటారు. ఇలా కర్ణాటక నుంచి వీటిని కొందరు తీసుకొస్తున్నారు. నగరంలోని మార్కెట్ చౌక్, చర్చివీధి, దర్గా సర్కిల్, కొంగారెడ్డిపల్లె, గిరింపేట, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, మురుగానిపల్లె, తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కూలిప్స్ విక్రయాలు అధికంగా ఉంటుందని ఓ టీచర్ చెప్పారు. కూలి్‌ప్సలో లాభం అధికంగా రావడంతో పలమనేరు, పుంగనూరు, తిరుపతి, నగరి, పుత్తూరు ప్రాంతాలకు విస్తరించినట్లు సమాచారం.
‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్’ పేరిట తనిఖీలు
పోలీసులు, ఈగల్ టీం సభ్యులు విద్యా సంస్థలకు వంద మీటర్ల పరిధిలో ఉన్న పాన్ షాపులు, కిరాణ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2025వ సంవత్సరంలో 1901 కేసులు నమోదు చేసి రూ.2.77 లక్షల జరిమానా విధించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 612 కేసులు నమోదుచేసి, రూ.69వేల జరిమానా వేశారు. ఈగల్ టీమ్, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ వారి కళ్లుగప్పి జిల్లాలో కూలిప్స్ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారానికి భారీగా మామూళ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి వ్యాపారాలు ఆపేయండి
పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, కూలిప్స్ వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా విద్యా సంస్థల సమీపాల్లో విక్రయిస్తే విద్యార్థులు అలవాటుపడే ప్రమాదముంది. విద్యార్థులు, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వ్యాపారాలను ఆపేయాలి. ఇంకా ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- తుషార్ డూడీ, ఎస్పీ