వైసీపీ చైర్మన్ అభ్యర్థి నామినేషన్‌పై వివాదం
ABN , Publish Date - Oct 20 , 2026 | 01:45 AM
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటాచలపతి నామినేషన్‌పై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక దొంతివీధిలో సోమవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఈ అంశంపై కొంతసేపు వివాదంతోపాటు ఉత్కంఠకు దారితీసింది. జింకా వెంకటాచలపతి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారని, బీసీ కులధ్రువీకరణను ఎలా ఆమోదిస్తారన్నది అందులోని సారాంశం.
అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోని అధికారులు
కలెక్టర్‌ను కలిసిన ఇద్దరు చైర్మన్ అభ్యర్థులు
నామినేషన్ ఆమోదంతో జింకాకు లైన్ క్లియర్
మదనపల్లె, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటాచలపతి నామినేషన్‌పై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక దొంతివీధిలో సోమవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఈ అంశంపై కొంతసేపు వివాదంతోపాటు ఉత్కంఠకు దారితీసింది. జింకా వెంకటాచలపతి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారని, బీసీ కులధ్రువీకరణను ఎలా ఆమోదిస్తారన్నది అందులోని సారాంశం. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు రావడంతో టీడీపీ చైర్మన్ అభ్యర్థి జి.శ్రీరామ్‌చినబాబు, ఆ పార్టీ నేతలు కలసి ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీలకు ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నిశాంత్‌కుమార్‌ను కలసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. మున్సిపల్ చైర్మన్ స్థానం బీసీ జనరల్ అయిందని, ఇందుకు సంబంధించిన అభ్యర్థి రెవెన్యూ శాఖ జారీ చేసిన బీసీ కులధ్రువీకరణ పత్రం నామినేషన్ సందర్భంగా సమర్పించారని పేర్కొంటూ అసిస్టెంట్ ఎన్నికల అధికారి టీడీపీ నేతల అభ్యంతరాన్ని తిరస్కరించారు. దీంతో నామినేషన్‌ను ఓకే చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నా కులం మానవత్వం: జింకా వెంకటాచలపతి
తన కులం, నామినేషన్ ఆమోదంపై ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటాచలపతి పేర్కొన్నారు. తాను ఏ ఒక్క కులానికో, మతానికో పరిమితమైన వ్యక్తిని కాదని, తన కులం మానవత్వమని మీడియాతో పేర్కొన్నారు. అందరినీ సమానంగా చూస్తూ ప్రజాసేవకు అంకితం అయ్యాయని తెలిపారు. 20 ఏళ్లుగా పట్టణంలో ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు. తన నామినేషన్ తిరస్కరణకు గురైందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అధికారిక జాబితా విడుదల కాకముందే నామినేషన్ తిరస్కరణకు గురైందంటూ ప్రచారం చేయడం ప్రజలను అయోమయానికి గురిచేయడమేనని జింకా ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లెలో చైర్మన్‌తోపాటు మెజారిటీ కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.