మ్యాపింగ్‌కు సహకరించండి
ABN , Publish Date - Jul 15 , 2026 | 01:41 AM
2.02లక్షల మంది ఓటర్లకు కలెక్టర్ విజ్ఞప్తి
తిరుపతి(కలెక్టరేట్), జూలై 14(ఆంధ్రజ్యోతి):రెండు చోట్ల ఓటున్న వారు ఒక చోట ఓటు హక్కును రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాటాడారు. ఒక కుటుంబంలో సభ్యులందరిని ఒకే పోలింగ్ కేంద్రంలోకి తీసుకువస్తామని అందుకు ఫారం 8 సమర్పించాలన్నారు. ఓటర్ల ఇంటింటి ధృవీకరణ గడువును ఈనెల 24 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది కాబట్టి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారు బీఎల్వోకు అందజేయాలని విజ్ఞప్తిచేశారు. జిల్లాలో మొత్తం 17,69,438మంది ఓటర్లున్నారని, ఇప్పటి వరకు 14,77,424 ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించామన్నారు. అయితే 2,91,996మంది ఫారాలు సేకరించబడలేదని, వీరిని ఏఎస్‌డీ(ఆచూకీ లేని, వలస వెళ్లినవారు, మృతులు) జాబితాలో చేర్చామన్నారు. ఈ జాబితాను ప్రతి ఒక్కరూ పరిశీలించాలని ఎవరి పేరు అయినా పొరబాటుగా ఉంటే నియోజకవర్గ ఈఆర్వోకు తగిన ఆధారాలతో అభ్యంతరాలు దాఖలు చేయవచ్చన్నారు. లేదంటే ఆ ఓట్లు తొలగించబడ తాయన్నారు.ఎన్యూమరేషన్ పారాలు అందజేసిన 2,00,310 మందికి ఓటర్ల జాబితాతో లేదా తల్లిదండ్రులు, తాత ముత్తాతల వివరాలతో మ్యాపింగ్ కాలేదని తెలిపారు.మ్యాపింగ్ కాలేదన్న కారణంతో ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జరగదని స్పష్టం చేశారు. వీరందరి పేర్లు కూడా జూలై31న విడుదల అయ్యే ముసాయిదా జాబితాలో ప్రకటిస్తామన్నారు.మ్యాపింగ్ కాని ఓటర్లు అందరూ ఎన్నికల సంఘం సూచించిన 11ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒక దానిని బీఎల్వోకు సమర్పించాలన్నారు. సెప్టెంబరు 20వ తేదీ నాటికి ఓటర్ల అభ్యంతరాలు పరిశీలించి అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు.కాగా మంగళవారం రాజకీయ పార్టీల నేతలతో సర్ కార్యక్రమంపై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు. జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావచ్చిందని, ఇక 200మంది ఓటర్ల వివరాల సేకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. జిల్లాలో 2,92,872 మంది ఏఎస్‌డీ జాబితాలో ఉన్నారని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఆచూకీ లేని ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాష్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు సుధారెడ్డి, నరేష్‌బాబు, సామంచి శ్రీనివాస్, నరేంద్రరెడ్డి, లోకేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మనోహర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.