ఒప్పంద ఉద్యోగుల వేతన యాతన
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:42 AM
ఒప్పంద, ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు మార్చినెల వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. నిధి పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక కారణాలే ఇందుకు కారణమని ఖజానా అధికారులు చెబుతున్నారు.
కొత్త పోర్టల్‌లో ఎదురైన సాంకేతిక సమస్యలు
ఇప్పటికీ అందని మార్చినెల జీతాలు
ఈనెలలో ప్రారంభంకాని బిల్లుల ప్రక్రియ
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఒప్పంద, ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు మార్చినెల వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. నిధి పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక కారణాలే ఇందుకు కారణమని ఖజానా అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో ముగియనున్న ఏప్రిల్ వేతనాలు అందడం కూడా సందేహనంటున్నారు. కార్యాలయాల్లో బిల్లుల సమర్పణ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించలేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారె. వరుసగా రెండు నెలలు వేతనాలు అందకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోగలమని ప్రశ్నిస్తున్నారు.
ఈనెలలోనైనా సకాలంలో అందేనా..
జిల్లావ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఒప్పంద, ఎంటీఎస్ ఉపాధ్యాయులు రెండువేల మంది వరకు ఉన్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్, ఆరోగ్యశాఖల్లో అధ్యాపకులు, ఆరోగ్య సహాయకులు, ఇతర ఉద్యోగులు సుమారు వెయ్యి మంది వరకు ఉంటారు. వీరేకాకుండా డీఎస్సీ అభ్యర్థులు, గిరిజన సంక్షేమశాఖ, ప్రభుత్వ ఆస్పత్రులు, కస్తూర్బా విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలు, గురుకులాలు, ఇతర శాఖల్లో వందలమంది ఉన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వీరికి వేతనాలు విడుదల కావడంలేదు. గతంలో అన్ని శాఖల్లోని ఒప్పంద ఉద్యోగులకు ప్రత్యేక పద్దు ద్వారా వేతనాలు చెల్లించేవారు. అయితే జవాబుదారీతనం, పారదర్శకత లేదని భావించిన ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే నిధి పోర్టల్ ద్వారానే ప్రతినెలా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈమేరకు ఒప్పంద, ఎంటీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలను నిధి పోర్టల్‌లో క్రోడీకరించాలని అనుకున్నారు. వివరాలను పోర్టల్‌లో ఆయా శాఖల డీడీవోలు నమోదు చేయడం ప్రారంభించారు. మార్చి బిల్లులు రెగ్యులర్ ఉద్యోగుల బిల్లులతోనే సమర్పించారు. కానీ రెగ్యులర్ ఉద్యోగుల బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. నిధి పోర్టల్‌లో సీఎ్‌ఫఎంఎస్ నెంబర్‌కు మ్యాచింగ్ విషయంలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఒప్పంద, ఎంటీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మార్చినెల బిల్లుతో పాటు ఏప్రిల్ బిల్లులు కూడా శాశ్వత ఉద్యోగులతో పాటు తమకు అందుతాయో లేదోనని వారు కలవరపడుతున్నారు.