పులికాట్ సరస్సులో పాత సరిహద్దుల కొనసాగింపు
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:55 AM
మూడు దశాబ్దాల క్రితంనాటి సరిహద్దులనే తాత్కలిక సరిహద్దులుగా భావించి మత్స్యకారులు శాంతియుతంగా వేట సాగించేలా తిరుపతి,తిరువళ్లూరు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు.
తడ/తిరుపతి(కలెక్టరేట్), మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : మూడు దశాబ్దాల క్రితంనాటి సరిహద్దులనే తాత్కలిక సరిహద్దులుగా భావించి ఇరు రాష్ర్టాల మత్స్యకారులు శాంతియుతంగా వేట సాగించేలా తిరుపతి,తిరువళ్లూరు జిల్లాల కలెక్టర్లు వెంకటేశ్వర్, ప్రతాప్ చర్యలు తీసుకున్నారు.సోమవారం కలెక్టర్ల నడుమ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి ఎస్పీలు సుబ్బరాయుడు,వివేకానందశుక్లా, డీఆర్వో నరసింహులు పాల్గొన్నారు.కొద్ది నెలల క్రితం తమిళనాడుకు చెందిన మత్స్యకారులు పాత సరిహద్దులను కాదని సుమారు 3 కిలోమీటర్ల మేర ఆంధ్రా పరిధిలోని సరస్సులోకి చొచ్చుకొని వచ్చి అక్కడ కొత్తగా తాటిమొద్దులను నాటి ఆంధ్రా మత్స్యకారులు ఆ తాటి మొద్దులను దాటి రావద్దంటూ ఘర్షణకు తెరలేపారు. దీంతో మన మత్స్యకారులు కలెక్టర్‌ను ఆశ్రయించిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో జరిగిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరురాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలపై స్పష్టత లేకపోవడం వల్ల మత్స్యకారుల మధ్య అపోహలు తలెత్తి ఘర్షణలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు వచ్చే శుక్రవారం గుమ్మిడిపూడి తహసీల్దారు కార్యాలయంలో ఇరు జిల్లాల డీఎస్పీ, ఆర్డీవోల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 30 ఏళ్ల నుంచి ఉన్న సరిహద్దులు ప్రస్తుతం అలాగే కొనసాగుతాయని తేల్చిచెప్పారు.ఇరుపక్షాల అంగీకారంతో జీపీఎస్ ద్వారా సరిహద్దులను డిజిటల్‌గా నమోదు చేసి భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డీవో దేవేంద్రరెడ్డి, బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, సూళ్లూరుపేట డీఎ్‌ఫవో హారిక, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే శుక్రవారం సమన్వయకమిటీ సమావేశం అనంతరం అధికారులు, మత్స్యకార నాయకులు కలసి ప్రస్తుతం ఉన్న సరిహద్దులను ప్రత్యక్షంగా పరిశీలిస్తారని బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ తెలిపారు.