చిత్తూరు ‘కూటమి’లోనూ పోటీ
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:53 AM
చిత్తూరు కార్పొరేషన్‌లో తొమ్మిది డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా.. ఆరింటిలో ‘కూటమి’ పార్టీలూ పోటీపడుతున్నాయి. ఐదు డివిజన్లలో టీడీపీ, జనసేన.. మరో డివిజన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మరో డివిజన్‌లో మూడు పార్టీలూ పోటీ
చిత్తూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు కార్పొరేషన్‌లో తొమ్మిది డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా.. ఆరింటిలో ‘కూటమి’ పార్టీలూ పోటీపడుతున్నాయి. ఐదు డివిజన్లలో టీడీపీ, జనసేన.. మరో డివిజన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లకు గాను టీడీపీకి 47, జనసేనకు 2, బీజేపీ, వైసీపీలకు ఒక్కోటి చొప్పున 51 ఏకగ్రీవమయ్యాయి. 21, 22, 27, 31, 32, 42, 44, 46, 53 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 21, 31, 32, 44, 46, 53 డివిజన్లలో వైసీపీ అభ్యర్థితో పాటు కూటమి పార్టీల అభ్యర్థుల మధ్యా పోటీ ఉంది.
ఫ 21వ డివిజన్‌లో టీడీపీ నుంచి నందిని, జనసేన తరపున వరలక్ష్మమ్మ.. 31లో లక్ష్మీపతి నాయుడు (టీడీపీ), నోమేశ్వరి (జనసేన).. 44లో కోలా మాధవి (టీడీపీ), ఆరణి కవిత (జనసేన).. 46లో రీటా (టీడీపీ), నిర్మల (జనసేన).. 53వ డివిజన్‌లో షర్మిల (టీడీపీ), అంజలి (జనసేన) పోటీ పడుతున్నారు. ఇక, 32వ వార్డులో మంజుల (టీడీపీ), స్వరూపారాణి (జనసేన)తో పాటు బీజేపీ అభ్యర్థి జయలక్ష్మి కూడా పోటీలో ఉన్నారు. ఇప్పటికే బీజేపీకి ఓ డివిజన్ ఏకగ్రీవమవ్వగా, 32వ డివిజన్‌లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఇక, జనసేన నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ఏకగ్రీవం కాగా.. కూటమి పొత్తులో భాగంగా 27, 42 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు పూల చందుకుమార్, లోచన్ వైసీపీ అభ్యర్థులతో పోటీ పడుతున్నారు.