Share News

సిలిండర్ల కోసం ఎగబడుతున్న వినియోగదారులు

ABN , Publish Date - Mar 15 , 2026 | 02:17 AM

ఇజ్రాయిల్‌-అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ కొరత ఏర్పడుతోందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారుల్లో గుబులు నెలకొంది. గ్యాస్‌ వినియోగదారుల పోర్టులో గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజులున్న సమయాన్ని 45 రోజులుగా, పట్టణ ప్రాంతాల్లో 20 రోజులున్న సమయాన్ని 25 రోజులుగా చేశారు

సిలిండర్ల కోసం ఎగబడుతున్న వినియోగదారులు
పీ అండ్‌ టీ కాలనీలో గ్యాస్‌ ఏజన్సీస్‌ వద్ద వేచి ఉన్న వినియోగదారులు గ్యాస్‌ గుబులు

మదనపల్లె అర్బన్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఇజ్రాయిల్‌-అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ కొరత ఏర్పడుతోందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారుల్లో గుబులు నెలకొంది. గ్యాస్‌ వినియోగదారుల పోర్టులో గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజులున్న సమయాన్ని 45 రోజులుగా, పట్టణ ప్రాంతాల్లో 20 రోజులున్న సమయాన్ని 25 రోజులుగా చేశారు. గ్యాస్‌ ధర రూ.880 ఉండగా కేంద్ర ప్రభుత్వ రూ.60 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవన్నీ వినియోగదారుల ఆందోళనను మరింత రెట్టింపు చేశాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేయడం ప్రారంభించారు. తద్వారా సర్వర్‌ డౌన్‌ కావడం, బిజీగా ఉన్నట్లు చూపడం, పనిచేయకపోవడంతో మరింత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వినియోగదారులు గ్యాజ్‌ ఏజన్సీల వద్దకు క్యూ కడుతున్నారు. కాగా, పట్టణాల్లో హోటల్స్‌ నిర్వాహకులు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్‌లో అధిక ధరకు కోనుగోలు చేస్తున్నారు. ఇంటికి వాడే గ్యాస్‌ సిలిండర్లు రూ.1,300, కమర్షియల్‌ సిలిండర్లు రూ.1,500కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మదనపల్లెలో రెవెన్యూ అధికారులు శనివారం షాపులు, హోటల్స్‌, టీ దుకాణాలు, స్నాక్స్‌, గోబిమంజూరి స్టాల్స్‌లో తనిఖీలు చేశారు. బిల్లు ఉంటేనే సిలిండర్‌ డెలివరీ ఇవ్వాలని ఏజెన్సీలకు సూచించారు. బ్లాక్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఒక పక్క అధికారులు గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదని ప్రకటనలు చేస్తున్నా జరుగుతున్న పరిణామాలు వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

గ్యాస్‌ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

గోదాములను తనిఖీ చేసిన తహసీల్దార్‌

గ్యాస్‌ కృత్రిమ కొరత సృష్టించినా, సిలిండర్లను బ్లాక్‌లో అధిక ధరకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ కిశోర్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని ఐదు గ్యాస్‌ ఏజెన్సీ, గోదాములను సీఎస్‌ డీటీ ఎన్‌.ఫిరోజ్‌ఖాన్‌తో కలసి శనివారం పరిశీలించారు. అక్కడి యాజమాన్యం, సిబ్బందికి, రూట్‌బాయ్స్‌కు పలు సూచనలు చేశారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను దుకాణాలు, హోటళ్లకు సరఫరా చేయకూడదని సూచించారు. కమర్షియల్‌ సిలిండర్లు కూడా రెండు మూడు రోజుల్లో సరఫరా చేస్తామని తెలిపారు. ఏజెన్సీలలో రికార్డులు, గోదాముల్లో నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, వీఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 02:17 AM