తలకోనలో కలకలం
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:46 AM
ప్రముఖ పర్యాటక కేంద్రమైన తలకోనలో గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ మదగజం పర్యాటకులపైకి దూసుకొచ్చింది. తలకోన సిద్ధేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
- పర్యాటకులపైకి దూసుకొచ్చిన గజరాజు
ఎర్రావారిపాలెం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక కేంద్రమైన తలకోనలో గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ మదగజం పర్యాటకులపైకి దూసుకొచ్చింది. తలకోన సిద్ధేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. వేసవి సెలవులుండడంతో పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో తలకోనను సందర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 7గంటల సమయంలో పర్యాటకులు, ఆలయ అర్చకులు వాహనాల్లో తలకోన నుంచి నెరబైలు వైపు బయలుదేరారు. తలకోన గుడికి పశ్చిమం వైపు 200 మీటర్ల దూరంలోని ఆర్చి-సీబీఈటీ రోడ్డు మార్గమధ్యంలో విద్యుత్ స్తంభం వద్దకు రాగానే ఒక్కసారిగా పొదల మాటు నుంచి ఏనుగు ఘీంకరిస్తూ పర్యాటకుల వైపు దూసుకొచ్చింది. అప్రమత్తమైన పర్యాటకులు ప్రాణభీతితో గుడి వైపు పరుగులు తీశారు. ఒంటరి ఏనుగు మాత్రమే పర్యాటకులకు కనపడింది. సమీపంలోనే ఏనుగు మంద ఉంటుందని భావించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. గతంలో ఎప్పుడూ తలకోన రోడ్డు మార్గంలో ఏనుగుల బెడదను భక్తులు కానీ పర్యాటకులు కానీ ఎదుర్కోలేదు. రాత్రివేళ పంటలపై దాడి చేస్తున్న ఏనుగులు పగటిపూట తలకోన అడవుల్లో సేదదీరుతున్నాయి.ఈ క్రమంలో మందనుంచి వచ్చిన ఈ ఏనుగు కాసేపు రోడ్డుపైనే పర్యాటకులను భయభ్రాంతులను చేశాక రోడ్డుకు తూర్పువైపుగా పొదల్లో దూరి మందలో కలిసిపోయింది.ఏనుగుల సంచారాన్ని ట్రాకింగ్ వ్యవస్థ వున్న అటవీశాఖ అధికారులు ముందుగా గుర్తించి అప్రమత్తం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.