Share News

నాలుగో విడత రీసర్వే పక్కాగా నిర్వహించండి

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:29 AM

రీసర్వేని ఎలాంటి తప్పుల్లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు

నాలుగో విడత రీసర్వే పక్కాగా నిర్వహించండి
సర్వేయర్లు, వీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 110 గ్రామాల్లో నాలుగో విడత రీసర్వేని ఎలాంటి తప్పుల్లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో నాలుగో విడత రీసర్వేపై సమీక్షా సమావేశం, వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ విడతలో 1,18,360 ఎకరాల్లో రీసర్వే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గుడిపాల, చిత్తూరు రూరల్‌, వెదురుకుప్పం, కార్వేటినగరం, నగరి, బైరెడ్డిపల్లి, శాంతిపరం, గుడుపల్లి మండలాల్లో 14 గ్రామాలకు చెందిన సర్వేయర్లు, వీఆర్వోలతో లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. ప్రతి రీసర్వే ద్వారా భవిష్యత్‌లో ఎటువంటి వివాదాలు లేనివిధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి గ్రామ రికార్డుల్లో పట్టా, ప్రభుత్వ, డీకేటీ భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలన్నారు. సోమవారం వచ్చే పీజీఆర్‌ఎ్‌సలో ఎక్కువగా రెవెన్యూ, భూసమస్యలు, రీసర్వే, ల్యాండ్‌ అలైనేషన్‌, 22ఏ, అసైన్మెంట్‌ ల్యాండ్స్‌, ఈనామ్‌, ఆర్వోఆర్‌, వెబ్‌ల్యాండ్లపై ఎక్కువగా వస్తున్నాయని ఆరోపించారు. నిర్ణీత వ్యవధిలోగా సమస్యలను డివిజనల్‌ అధికారులు, తహసీల్దార్లు పరిష్కరించాలన్నారు. జేసీ ఆదర్శ్‌ రాజేంద్ర మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి రీసర్వేలో భారీగా తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. భూవివాదాలతో రైతులు, అధికారులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. తప్పులు దొర్లితే.. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ నరేంద్ర పాడల్‌, ట్రైనీ ఎస్పీ తరుణ్‌, సర్వేశాఖ డీడీ జయరాజ్‌, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మిగిలిన ఆర్డీవోలు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:29 AM