Share News

టోల్‌ప్లాజా పరిసర గ్రామాల వారికి వెసులుబాటు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:04 AM

జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌ ప్లాజాల నుంచి వెళ్లడానికి దానికి సమీపంలో ఉన్న గ్రామాల వారికి వెసులుబాటు కల్పించారు. గతంలో టోల్‌ప్లాజాకు 20 కి.మీ పరిధిలో నివాసమున్న వారు నెలకు రూ.350 వంతున చెల్లించి వెళ్లే అవకాశం కల్పించారు.

టోల్‌ప్లాజా పరిసర గ్రామాల వారికి వెసులుబాటు
బురకాయలకోట టోల్‌ ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న ప్రజలు (ఫైల్‌ ఫొటో)

టోల్‌ప్లాజా పరిసర గ్రామాల వారికి వెసులుబాటు

రూ.1500 వార్షిక రుసుంతో ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్‌

నవంబరు 1 నుంచి అమల్లోకి..

కలికిరి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌ ప్లాజాల నుంచి వెళ్లడానికి దానికి సమీపంలో ఉన్న గ్రామాల వారికి వెసులుబాటు కల్పించారు. గతంలో టోల్‌ప్లాజాకు 20 కి.మీ పరిధిలో నివాసమున్న వారు నెలకు రూ.350 వంతున చెల్లించి వెళ్లే అవకాశం కల్పించారు. దీనిపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా మరింత వెసులుబాటు కల్పించారు. ఇక నుంచి రూ.1500తో వార్షిక ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్‌ జారీ చేయనున్నారు. దీంతో సంబంధిత టోల్‌ ప్లాజా ద్వారా సంవత్సరంలో ఎన్నిసార్లయినా ప్రయాణం చేసే అవకాశం లభిస్తోంది. ఈ వెసులుబాటు నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చేటట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అక్టోబరు 26న సవరణ నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో కూడా గత నెల 27న అధికారిక ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని జాతీయ రహదారులపైన నాలుగు చోట్ల టోల్‌ ప్లాజాలున్నాయి. రాయచోటి-కడప మార్గంలో బండపల్లె, మదనపల్లె-అనంతపురం రహదారి మీద బురకాయలకోట, అంగళ్లు-రాయచోటి మార్గంలో ముదివేడు, పీలేరు-మదనపల్లె మధ్య కలికిరి సమీపంలో గండబోయనపల్లె వద్ద టోల్‌ ప్లాజాలున్నాయి. గండబోయనపల్లె టోల్‌ ప్లాజా వద్ద వసూలు చేసే రుసుములు భారీగా ఉన్నాయని పలుమార్లు ఆందోళనలు జరిగాయి. బురకాయలకోట వద్ద కూడా తరచూ ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. రహదార్ల ఏర్పాటుకు తక్కువ ధరలకు భూములిస్తే, అదే భూమికి అటూ ఇటూ వెళ్లడానికి భారీ రుసుంలు వసూలు చేయడమేటనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

రూ.1500తో వార్షిక ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్‌లు

టోల్‌ ప్లాజా పరిసర గ్రామాల ప్రజలకు ఏడాదికి రూ.1500 చెల్లిస్తే వార్షిక ఫాస్ట్‌ ట్యాగ్‌ పాసులు చేయనున్నారు. వీటిని పొందడానికి ముందుగా వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్‌ అమర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ ద్వారా డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి రూ.1500 చెల్లించి ఫాస్ట్‌ ట్యాగ్‌ పాస్‌ను పొందొచ్చు. లేదంటే ఆయా టోల్‌ ప్లాజాల వద్ద కూడా ఈ పాసులను జారీ చేయనున్నారు. క్లోజ్డ్‌ యూజర్‌ ఫీ కలెక్షన్‌ విధానంలోని హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలకు మాత్రం ఇది వర్తించదు. కేవలం వ్యక్తిగత తేలకపాటి నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. చిరునామాకు సంబంధించి సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.

Updated Date - Nov 02 , 2026 | 12:04 AM