Share News

బీసీల పరిస్థితులపై సమగ్ర అధ్యయనం

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:08 AM

బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ కృషి చేస్తున్నట్లు చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌మిశ్రా తెలిపారు.

బీసీల పరిస్థితులపై సమగ్ర అధ్యయనం
రాజీవ్‌ రంజన్‌మిశ్రాకు వినతిపత్రం అందజేస్తున్న రుద్రకోటి సదాశివం

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ కృషి చేస్తున్నట్లు చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు డెడికేటెడ్‌ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో డెడికేటెడ్‌ కమిషన్‌ పర్యటించింది. కలెక్టరేట్‌లో శుక్రవారం గ్రామీణ, పట్టణ బీసీ రిజర్వేషన్‌ అధ్యయనం, బీసీ సంఘాల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల స్థితిగతులను కమిషన్‌ పరిశీలించి, ఆయా వర్గాల విద్య, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేస్తోందన్నారు. ప్రతినిధులు, ప్రజాసంఘాలు, సంబంధిత బీసీ వర్గాల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించి సమగ్ర నివేదికను రాష్ట్రప్రభుత్వానికి అందిస్తుందన్నారు. గడిచిపోయిన పరిస్థితుల ఆధారంగా కాకుండా ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే సమాచారాన్ని స్వీకరించేందుకు జిల్లా, మండల, మున్సిపాలిటీ స్థాయుల్లో కమిషన్‌ పర్యటిస్తుందన్నారు.గతంలో నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి జారీ చేసిన జీవోల అమలుకు చర్యలు తీసుకోవాలని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం కోరారు.విద్య, ఉద్యోగ రంగాల్లో అమలవుతున్న విధంగానే స్థానికసంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, నాయీబ్రాహ్మణ వృత్తిదారులు ఆధునిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడానికి వీలుగా స్కిల్‌ డెవలప్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ధన్వంతరి మహర్షి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి జీవో ఇవ్వాలని, 50 ఏళ్లు దాటిన నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.విశ్వవిద్యాలయాల్లో బీసీ అధ్యాపకుల మీద రాజకీయనాయకుల ప్రోత్సాహంతో అట్రాసిటీ కేసులు నమోదుచేసి మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ్‌ కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు.నాన్‌టీచింగ్‌లో పనిచేస్తున్న బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, జడ్పీ సీఈవో రవికుమార్‌, డీపీవో సుశీలాదేవి, డీఎల్‌డీవో గంగా భవాని, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం, బీసీ సంక్షేమాధికారి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 02:08 AM