అపార్ట్‌మెంట్ల నిర్మాణాలపై 1 నుంచి కాంపోజిట్ ధరల పెంపు
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:48 AM
అపార్ట్‌మెంట్ నిర్మాణాలపై ఫిబ్రవరి 1 నుంచి కాంపోజిట్ ధరలు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువలతో పాటు నిర్మాణ విలువ (కాంపోజిట్ రేట్)నూ పెంచుతూ ఆ శాఖ ఐజీ అంబేద్కర్ ఉత్తర్వులు జారీచేశారు.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అపార్ట్‌మెంట్ నిర్మాణాలపై ఫిబ్రవరి 1 నుంచి కాంపోజిట్ ధరలు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువలతో పాటు నిర్మాణ విలువ (కాంపోజిట్ రేట్)నూ పెంచుతూ ఆ శాఖ ఐజీ అంబేద్కర్ ఉత్తర్వులు జారీచేశారు. రోడ్లు, భవనాల శాఖ అధికారుల నుంచి సిమెంటు, ఇనుము ధరలు, వాటి వల్ల పెరిగిన నిర్మాణ వ్యయ ధరలు పరిగణలోకి తీసుకుని, వాటి ఆధారంగా కాంపోజిట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అన్ని అర్బన్ ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం అపార్టుమెంట్లలో సెల్లార్, పార్కింగ్ ఏరియాలలో చదరపు అడుగుకు రూ.960 విలువ కడుతున్నారు. ఇకపై చదరపు అడుగుకు రూ. 1020 చొప్పున లెక్కిస్తారు. అపార్టుమెంట్లలోని ఫ్లాట్లలో చదరపు అడుగుకు ధర ప్రస్తుతం రూ.1490 ఉండగా, ఆ ధరను రూ.1580కు పెంచనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ చదరపు అడుగుకు రూ.1800 వున్న ధరను రూ.1900కు పెంచుతున్నారు. మొదటి అంతస్థు నిర్మాణం ధర చదరపు అడుగుకు రూ.1700 ఉండగా, దానిని రూ.1800కు, వ్యక్తిగత గృహాలకు 10 అడుగుల ఎత్తుకు పైన ఉంటే వాటి చదరపు అడుగు ధర రూ.1500 నుంచి రూ.1700కు పెంచబోతున్నారు. మూడో అంతస్థు నుంచి ప్రతి ఫ్లోర్‌కు రూ.30 వంతున పెంచనున్నారు. ఇవన్నీ ప్రాథమిక విలువలని, ఆ ప్రాంత భూముల ధరలను బట్టి కాంపోజిట్ రేట్లు మారుతాయని రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు అంటున్నారు.
విలువల పెంపు అవసరం
అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడం సహజం. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ విలువలు లేకపోతే స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి నమ్మకం ఉండదు. పూర్తిగా బహిరంగ మార్కెట్ విలువతో సమానంగా పెంచకుండా రెండింటికీ మధ్య వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఫ వెంకటరమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, చిత్తూరు.