కుప్పకూలిన భవనం
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:29 AM
పక్కనున్న స్థలంలో నిర్మాణ పనులకు ఆరడుగుల గాడి తీయడమే కారణం స్థల యజమానిపై కేసు నమోదు
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. అనేక వ్యాపార సంస్థలున్న భవనంలో పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికీ... అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలోని వాణీనగర్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివీ.... తిరుపతి ఎస్టీవీ నగర్‌కు చెందిన ఎం.బాబుకు వాణీనగర్‌లో మూడంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇనుప ఫర్నిచర్ దుకాణం ఉండగా మొదటి అంతస్తులో మాట్రిమోనియల్ కార్యాలయం, రెండో అంతస్తులో ఓ సెలూన్‌కు సంబంధించిన ఉద్యోగులు, పెంట్ హౌస్‌లో ఇద్దరు నివాసితులు ఉంటున్నారు. భవనం పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేశ్వరరావుకు సంబంధించిన ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో భవన నిర్మాణానికి నాగేశ్వరరావు మంగళవారం నుంచి పనులు ప్రారంభించారు. భవనం పక్కనే గోడను ఆనుకుని సుమారు ఆరడుగుల లోతున గాడి తీశారు. దీంతో పక్కనే వున్న భవంతి పునాదులు కదిలిపోయి గోడల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. గమనించిన భవనంలోని వ్యాపార సంస్థల సిబ్బంది అప్రమత్తమై బయటకొచ్చేశారు. వారు భయపడినట్టుగానే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో భవనం పక్కనే ఉన్న ఐరన్ ఫర్నిచర్ దుకాణం, పై అంతస్తుల్లో మ్యాట్రిమోనియల్ కార్యాలయం, సెలూన్ ఉద్యోగులు, పెంట్‌హౌస్‌లో నివాసితులు ఆ ప్రాంతం నుంచి పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే భవనం పూర్తిగా కూలిపోవడంతో అందులోని ఫర్నిచర్, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోకపోవడంతో ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా తవ్వకాలు చేపట్టడమే భవనం కూలిపోవడానికి కారణమని సీఐ మద్దయ్యాచారి తెలిపారు. బాధితుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థల యజమాని నాగేశ్వరరావుపై అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించి మనుషుల ప్రాణాలకు ప్రమాదం, ఆస్తినష్టం కలిగించిన అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.