డైట్ విద్యార్థులకు కోడింగ్ డ్యూటీ!
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:40 AM
టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లలో ఉపాధ్యాయులతో చేయించాల్సిన కోడింగ్ విధులను కార్వేటినగరం డైట్ విద్యార్థులకు కేటాయించడంపై విమర్శలొస్తున్నాయి.
తిరుపతి(విద్య), మార్చి 25 (ఆంధ్రజ్యోతి): టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లలో ఉపాధ్యాయులతో చేయించాల్సిన కోడింగ్ విధులను కార్వేటినగరం డైట్ విద్యార్థులకు కేటాయించడంపై విమర్శలొస్తున్నాయి. పదవ తరగతి పరీక్షల పేపర్లకు సంబంధించి ఓఎంఆర్ షీట్లను సెపరేట్ చేసే కోడింగ్ విధులను మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు తిరుచానూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు.సాధారణంగా ఈ విధులను ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే అప్పగించాలి. వీరికి సహాయకులుగా డైట్ విద్యార్థులను ఉపయోగించుకోవాలి. అయితే మంగళవారం నిర్వహించిన కోడింగ్ విధులకు ఉపాధ్యాయులను పూర్తిగా పక్కన పెట్టి డైట్ విద్యార్థులతో చేయించారు. అంతేకాకుండా డైట్ విద్యార్థులు తప్పక స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లకు రావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ఒత్తిడి చేసినట్లు పలువురు వాపోతున్నారు. విద్యార్థులను బోధనా తరగతుల నుంచి దూరం చేసి పరిపాలనా విధులు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కోడింగ్ విధులు ఉపాధ్యాయులు నిర్వహిస్తుంటే ఇక్కడ మాత్రం డైట్ విద్యార్థులకు అప్పగించడం వెనుక అంతర్యమేంటో విద్యాశాఖ అధికారులకే తెలియాలని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈ విషయమై డీఈవో కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ కోడింగ్ విధులు డైట్ విద్యార్థులకు కేటాయించడం మామూలేనని, ఇందులో అభ్యంతరాలు ఏమీ లేవని సమాధానమిచ్చారు.