Share News

కూటమి సభ వాయిదా

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:58 AM

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం తిరుపతిలో జరప తలపెట్టిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభపై ప్రభావం చూపింది.మంగళవారం నిర్వహించాల్సిన సభ ఈనెల 12కు వాయిదా పడింది.

కూటమి సభ వాయిదా
కూటమి విజయోత్సవ సభ ఏర్పాట్లు

12న నిర్వహించాలని నిర్ణయం

తిరుపతి సిటీ, జూన్‌ 8 (ఆంద్రజ్యోతి):వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం తిరుపతిలో జరప తలపెట్టిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభపై ప్రభావం చూపింది.మంగళవారం నిర్వహించాల్సిన సభ ఈనెల 12కు వాయిదా పడింది. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తిచేసుకున్న నేపథ్యంలో మంగళవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించాలనుకున్న తొలి విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను సక్సెస్‌ చేయాలని గత రెండురోజులుగా కూటమి నేతలు, అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులు మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో విజయోత్సవ సభను వాయిదా వేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటికే తిరుపతి రూరల్‌ మండలం దామినేడులో భారీ బహిరంగ సభకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, యువనేత నారా లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ తదితర కూటమి కీలక నేతలు హాజరుకావాల్సి ఉంది. అయితే విశాఖ ఘటన తీవ్రత దృష్ట్యా సభను వాయిదా వేయాలని చంద్రబాబు భావించారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆ మేరకు వారి పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారు. ‘రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం’ పేరిట జరగాల్సిన సభ ఇదే ప్రాంగణంలో జూన్‌ 12న నిర్వహించనున్నారు.

Updated Date - Jun 09 , 2026 | 01:58 AM