Share News

1, 2 తేదీల్లో సీఎం పర్యటన

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:55 AM

జూలై 1,2 తేదీల్లో తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది.ఒకటవ తేది బుధవారం మధ్యాహ్నం సత్యవేడు మండలం మాదనపాళెం ఇండస్ర్టియల్‌ పార్కులో సుమారు 200 ఎకరాల్లో రూ.

  1, 2 తేదీల్లో సీఎం పర్యటన
హీరో పరిశ్రమ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికార బృందం

- హీరో కంపెనీ ప్లాంటు విస్తరణకు శంకుస్థాపన

- ఓబులవారిపల్లెలో వీబీజీ రామ్‌జీకి ప్రారంభోత్సవం

తిరుపతి(కలెక్టరేట్‌)/సత్యవేడు/రైల్వేకోడూరు, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): జూలై 1,2 తేదీల్లో తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది.ఒకటవ తేది బుధవారం మధ్యాహ్నం సత్యవేడు మండలం మాదనపాళెం ఇండస్ర్టియల్‌ పార్కులో సుమారు 200 ఎకరాల్లో రూ.700కోట్లతో హీరో కంపెనీ విస్తరణలో భాగంగా గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ శంకుస్థాపన జరగనుంది.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. బుధవారం హీరో పరిశ్రమ వద్ద శ్రీసిటీ డీఎస్పీ శ్రీనివాసులు, సూళ్లూరుపేట ఆర్డీవో దేవేంద్రరెడ్డి, సత్యవేడు తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌ తదితరులు పర్యటించారు.హీరో పరిశ్రమ ప్రతినిధులతో చర్చించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.కాగా ఉపాధి హామీ పథకానికి రూపుమార్చి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్‌జీ(వికసిత భారత్‌-రోజ్‌గార్‌ మరియు అజీవికా మిషన్‌) పథకం ప్రారంభోత్సవం మన రాష్ట్రం నుంచే ప్రారంభం కానుంది. జూలై 2న గురువారం రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట సమీపంలో వున్న ముక్కవారిపల్లెలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వీబీజీ రామ్‌జీ పథకాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కూడా పాల్గొంటారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.2006లో ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించగా దానిస్థానంలో తెచ్చిన వీబీజీ రామ్‌జీ పథకాన్ని కూడా మన రాష్ట్రం నుంచే ప్రారంభించడం విశేషం.బుధవారం ఉపాధి హామీపథకం పీడీ మద్దిలేటి, జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, ఆర్‌అండ్‌బీ డీఈ జయప్రకాష్‌, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, తహసీల్దార్లు కోనేటి అమర్‌నాథ్‌, సిద్ధేశ్వరరావు తదితరులు రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట వద్ద బహిరంగ సభ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. తర్వాత మంగంపేట ఆర్‌ఆర్‌-5 వద్ద స్థలాన్ని పరిశీలించారు. శెట్టిగుంట వద్ద ఉన్న స్థలం అనుకూలంగా ఉంటుందని అంచానాకు వచ్చారు.గురువారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు స్థల పరిశీలనకు రానున్నారు. వారి పర్యటన తరువాతే సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Updated Date - Jun 25 , 2026 | 12:55 AM