Share News

శ్రీకాళహస్తికి రేపు సీఎం రాక

ABN , Publish Date - Aug 29 , 2026 | 01:13 AM

సీఎం చంద్రబాబు ఆదివారం ఉదయం శ్రీకాళహస్తికి రానున్నారు.పట్టణంలోని కొత్త బైపాస్‌రోడ్డులో వున్న సీసీఎన్‌ కల్యాణ మండపంలో జరిగే శాప్‌ మాజీ చైర్మన్‌,దివంగత పీఆర్‌ మోహన్‌ కుమార్తె వివాహానికి ఆయన హాజరు కానున్నారు.

శ్రీకాళహస్తికి రేపు సీఎం రాక
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు

శ్రీకాళహస్తి/తిరుపతి(కలెక్టరేట్‌), ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఆదివారం ఉదయం శ్రీకాళహస్తికి రానున్నారు.పట్టణంలోని కొత్త బైపాస్‌రోడ్డులో వున్న సీసీఎన్‌ కల్యాణ మండపంలో జరిగే శాప్‌ మాజీ చైర్మన్‌,దివంగత పీఆర్‌ మోహన్‌ కుమార్తె వివాహానికి ఆయన హాజరు కానున్నారు.టీడీపీ ప్రారంభించిన రోజునుంచీ ఎన్టీఆర్‌, చంద్రబాబులతో పీఆర్‌ మోహన్‌ సన్నిహితంగా మెలిగిన విషయం తెలిసిందే.కరోనా సమయంలో పీఆర్‌ మోహన్‌ కన్నుమూసిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు శ్రీకాళహస్తికి వచ్చారు.పీఆర్‌ మోహన్‌ పాడెను మోయడంతో పాటు ఆయన కుటుంబసభ్యులకు ఽ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ క్రమంలో ఆదివారం జరనున్న పీఆర్‌మోహన్‌ కుమార్తె వివాహానికి చంద్రబాబు విచ్చేయనున్నారు.ఆయన పర్యటన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు.ముందుగా కొత్త బైపాస్‌రోడ్డులోని ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న హెలిప్యాడ్‌ ప్రదేశాన్ని పరిశీలించారు. ల్యాండింగ్‌, టేకాఫ్‌ కోసం అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం సీఎం పర్యటన సాగనున్న సీసీఎన్‌ కల్యాణ మండపం వరకు రోడ్డు మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రి నుంచి సీసీఎన్‌ కల్యాణ మండపం వరకూ భద్రత, ట్రాఫిక్‌, పారిశుధ్య ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీఐపీలు, ప్రముఖుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ కల్పించాలని సూచించారు. అదే విధంగా అడ్వాన్స్‌డ్‌ అంబులెన్సులు, జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ హెలిప్యాడ్‌ ప్రాంతంతో పాటు కల్యాణమండపం, సీఎం పర్యటించనున్న రోడ్డు మార్గంలో క్షుణ్ణంగా బాంబ్‌, డాగ్‌ స్వ్కాడ్లతో తనిఖీలు చేయాలని చెప్పారు.ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి,ఏఎస్పీలు రామకృష్ణ, శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్‌, ఆర్‌ఆండ్‌బీ ఎస్‌ఈ రాజానాయక్‌, జిల్లా రవాణా అధికారి మురళీమోహన్‌, తొట్టంబేడు తహసీల్దారు భారతి, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సీఐలు నాగరాజు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఇలా...

ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదివారం ఉదయం 11.30గంటలకు శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన సీఆర్‌ఎన్‌ కండ్రిగ గ్రామం వద్ద ఉన్న సీసీఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు 11.55గంటలకు చేరుకుంటారు.పీఆర్‌ మోహన్‌ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి అక్కడినుంచి ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని 12.05గంటలకు అనంతపురం జిల్లా పర్యటనకు వెళతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతపురంలో జరిగే గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మడి జయరాం కుమార్తె వివాహానికై హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.తిరిగి మధ్యాహ్నం 2గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని ఉండవల్లి బయల్దేరి వెళతారు.

Updated Date - Aug 29 , 2026 | 01:13 AM