జాతీయస్థాయికి సీఎం పంచాయతీ
ABN , Publish Date - May 13 , 2026 | 12:19 AM
సౌరశక్తి, పర్యావరణ పరిరక్షణలో సీఎం చంద్రబాబు సొంత పంచాయతీ అయిన చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లెను జాతీయ స్థాయి అవార్డు వరించింది
తిరుపతి(కలెక్టరేట్), మే 12 (ఆంధ్రజ్యోతి): సౌరశక్తి, పర్యావరణ పరిరక్షణలో సీఎం చంద్రబాబు సొంత పంచాయతీ అయిన చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లెను జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఏటా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇచ్చే నేషనల్ పంచాయతీ అవార్డు కింద నిర్వహించిన క్లైమేట్ యాక్షన్ స్పెషల్ కేటగిరీ కింద కందులవారిపల్లె పంచాయతీ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కింద పంచాయతీకి రూ.కోటి నజరానాను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌లో ఢిల్లీ వేదికగా జరగనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ అవార్డును అందుకోనున్నారు.కాగా కందులవారిపల్లె అవార్డుకు ఎంపిక కావడం పట్ల సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.ఇందుకు కారకులైన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.
ఎలా సాధ్యమైందంటే..
కందులవారిపల్లెలో మొత్తం 1,583 జనాభా. 512 కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయం వీరి జీవనాధారం. మహిళా సాధికారతకు 40 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఉపాధి పథకం ద్వారా వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. సీఎం ప్రత్యేక చొరవతో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో డీపీవో సుశీలాదేవి బృందం నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, పునరుత్పాదక శక్తి వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాల్లో గ్రామస్తులను భాగస్వామ్యం చేశారు. ముఖ్యంగా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించి డ్రిప్, స్ర్పింక్లర్ల సాగు పద్ధతులను అవలంబించడం, వర్షపునీటిని సంరక్షణకు రీచార్జ్ కిట్లను ఏర్పాటు చేశారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద 473 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయించారు. దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.5.67కోట్ల నిధులను మంజూరుచేసింది. ప్రస్తుతం గ్రామంలో నెలకు సుమారు 1.13లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. గ్రామ అవసరాలకుపోను మిగిలిన విద్యుత్‌ను ఎస్పీడీసీఎల్ గ్రిడ్‌కు పంపిస్తున్నారు. దీంతోపాటు తాగునీటి సరఫరాకు ఉపయోగించే మోటారు పంపుసెట్లు కొన్నింటిని సౌరశక్తితో నడిచేవిధంగా ఏర్పాటు చేశారు. గ్రామంలో కట్టెల పొయ్యి అనేదే లేకుండా ఉజ్వల యోజన, దీపం 2.0 పథకాలద్వారా ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఇక పీఎం అజయ్ పథకం ద్వారా గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు ఈ-ఆటోలు అందించగా విద్యార్థుల్లో ఈ-సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించారు. ఇంటింటి నుంచి చెత్తసేకరణ జరుగుతోంది. రోడ్ల పక్కన, పాఠశాలలు, ఖాళీ ప్రదేశాల్లో దాదాపు 90వేలకుపైగా మొక్కలునాటారు. వాట్సాప్ ఆధారిత సమాచార వ్యవస్థ, పేపర్‌లెస్ పరిపాలన, డిజిటల్ సేవల వినియోగంతో ఆధునిక పాలనకు శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి గుడ్డ సంచులు, పర్యావరణహిత వస్తువులను వినియోగించేలా చేశారు. ఇలా.. సీఎం చొరవతోపాటు గ్రామస్తుల భాగస్వామ్యం, జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో దేశంలోనే ఆదర్శ పంచాయతీగా కందులవారిపల్లె నిలిచింది.