Share News

సామాన్య భక్తుడిలా సీఎం

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:15 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటనలో సామాన్యుడిలా గడిపారు. నుదుట తిరునామం, భుజంపై కండువా, పంచె,చొక్కాతో మనవడి చేయిపట్టుకుని ఆయన ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లే వెసులుబాటున్నప్పటికీ భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌, కుమారుడు లోకేశ్‌తో కలిసి క్యూలైన్‌ ద్వారానే శనివారం ఉదయం 6.40 గంటలకు మహద్వారం వద్దకు చేరుకున్న సీఎంకు అర్చకులు, టీటీడీ ఈవో రవిచంద్ర, ఏఈవో వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

సామాన్య భక్తుడిలా సీఎం
చంద్రబాబుకు శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

తిరుమల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటనలో సామాన్యుడిలా గడిపారు. నుదుట తిరునామం, భుజంపై కండువా, పంచె,చొక్కాతో మనవడి చేయిపట్టుకుని ఆయన ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లే వెసులుబాటున్నప్పటికీ భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌, కుమారుడు లోకేశ్‌తో కలిసి క్యూలైన్‌ ద్వారానే శనివారం ఉదయం 6.40 గంటలకు మహద్వారం వద్దకు చేరుకున్న సీఎంకు అర్చకులు, టీటీడీ ఈవో రవిచంద్ర, ఏఈవో వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వేదాశీర్వచనం పొందిన సీఎంకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు లడ్డూప్రసాదాలను అందజేశారు.ఆలయంలో అర్చక బృందాన్ని, పోటు కార్మికులను, వేదపండితులను ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు. ప్రత్యేకించి లడ్డూప్రసాదాల నాణ్యత, ప్రస్తుతం సరఫరా అవుతున్న నెయ్యిపై పోటు కార్మికులతో మాట్లాడారు.7.40 గంటలకు ఆలయం వెలుపలకు వచ్చారు.ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరీ భక్తులను ఆప్యాయంగా పలకరించారు.అన్నప్రసాద భవనానికి వెళ్లే మార్గంలో భక్తుల వద్దకు వెళ్లి మాట్లాడారు. అన్నప్రసాద భవనం నుంచి అతిథిగృహం వద్దకు కాన్వాయ్‌ వెళుతున్న సమయంలో లేపాక్షి సర్కిల్‌ వద్ద భక్తులు భారీసంఖ్యలో ఉండడాన్ని గమనించిన సీఎం వాహనం దిగి వారి వద్దకు వెళ్లారు. కాఫీ బోర్డు వరకు రోడ్డుపై నడుచుకుంటూనే వెళ్లి భక్తులను పలకరించారు. కరచాలనం చేస్తూ ఫొటోలు దిగారు. స్థానిక మహిళ ఇచ్చిన కరుంగళి మాలను స్వీకరించి ధరించడం విశేషం. కొందరు చిన్నారులను ఎత్తుకుని ఫొటోలు దిగిన సీఎం.. మరికొందరు భక్తులతో టీటీడీ సౌకర్యాలపై ఆరా తీశారు. లడ్డూప్రసాదాలు ఎలా ఉన్నాయని అడిగిన సీఎంకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయని తెలిపారు. మరికొంతమంది దర్శనం వేగంగా జరిగేలా చూడాలని కోరగా, సీఎం స్పందిస్తూ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఇప్పటికే ఏర్పాటు చేశామని, త్వరలోనే ఏఐ టెక్నాలజీ ద్వారా మరింత త్వరగా దర్శనం చేయిస్తామన్నారు.అనంతరం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సవాల్లో మధ్యాహ్నం వరకు బిజీబిజీగా గడిపారు.ఆయన వెంట మంత్రులు సత్యప్రసాద్‌, సత్యకుమార్‌, ఎమ్మెల్యేలు పులివర్తి నాని,ఆరణి శ్రీనివాసులు, మురళీమోహన్‌, గాలి భానుప్రకా్‌ష,శాప్‌ చైర్మన్‌ రవినాయుడు,టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, జంగా కృష్ణమూర్తి,దివాకరరెడ్డి, భానుప్రకా్‌షరెడ్డి, సాంబశివరావు, జ్యోతుల నెహ్రు, శాంతారామ్‌, నరేష్‌ కుమార్‌, యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహాయాదవ్‌,టీడీపీ నేతలు జేబీ శ్రీనివాస్‌, కోడూరు బాలసుబ్రహ్మణ్యం,బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 01:15 AM