Share News

భోగి వేడుకల్లో సీఎం

ABN , Publish Date - Jan 15 , 2026 | 01:54 AM

చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వేశారు. హరిదాసుల సంకీర్తనలను విన్నారు,

భోగి వేడుకల్లో సీఎం
కుటుంబ సభ్యులతో కలిసి గంగిరెద్దు విన్యాసాలను తిలకిస్తున్న సీఎం చంద్రబాబు

కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు

చంద్రగిరి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వేశారు. హరిదాసుల సంకీర్తనలను విన్నారు, గంగిరెద్దుల ప్రదర్శనలను తిలకించారు. కళాకారులకు కొత్తబట్టలు, ధన, దాన్యాలు అందించారు. పల్లె అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. భోగి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను ప్రముఖులు కలిశారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌ రెడ్డి, భాను ప్రకాష్‌, ఏపీజీబీసీ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, తుడా ఛైర్మన్‌ డాలర్‌ దివాకర్‌ రెడ్డి, శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు, మాజీ మంత్రి చెంగారెడ్డితో పాటు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

నేడు తల్లిదండ్రులకు నివాళి

సంక్రాంతి సందర్భంగా గురువారం ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యులు గ్రామదేవత దొడ్డిగంగమ్మను దర్శించుకుని, కులదేవత నాగాలమ్మకు పూజలు నిర్వహించనున్నారు. చంద్రబాబు తల్లితండ్రులు నారా ఖర్జురపు నాయుడు, అమ్మణమ్మ, సోదరుడు రామ్మూర్తి నాయుడి సమాధుల వద్ద.. ఆ తర్వాత ఎన్టీఆర్‌, బసవతారకమ్మ విగ్రహాలకు నివాళులు అర్పిస్తారు. మీడియా సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తిరుగుప్రయాణం కానున్నారు.

పోటెత్తిన అర్జీదారులు

వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు అర్జీలు చేతపట్టుకుని నారావారిపల్లెకు క్యూ కట్టారు. తొలుత సీఎం చంద్రబాబు ఫిర్యాదులు స్వీకరిస్తారని భావించారు. అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో మంత్రి నారా లోకేశ్‌ మాత్రమే అర్జీలు స్వీకరించి, వారితో ఫొటోలు దిగారు. సాయంత్రం 5 గంటలపైన కూడా ప్రజలు పెద్దఎత్తున చేరుకోవడంతో గురువారం రావాలని అధికారులు తిప్పి పంపారు. ఇంత మంది రావడంతో పోలీసులు క్యూలైన్‌లో పంపారు. క్యూలైన్‌లో మెటల్‌ డిటెక్టర్‌ తనిఖీ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో జనం గుమికూడడంతో కాసేపు తోపులాట జరిగింది. ఇంతలో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌, సీఐ సురేష్‌, రిజర్వు బలగాలు వారిని వారించి మెల్లగా లోపలికి అనుమతించారు.

Updated Date - Jan 15 , 2026 | 01:54 AM