తరగతి 9.. పాఠాలు 10
ABN , Publish Date - Mar 12 , 2026 | 02:30 AM
ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు టెన్త్ పాఠాలు నేర్పించేందుకు రాష్ట్ర పాఠశాల విద్య తెరతీసింది. 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 2న ప్రారంభమైన సమ్మేటివ్ అసెస్మెంట్-2 (వార్షిక పరీక్షలు) గురువారంతో ముగియనున్నాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు.. 40 రోజుల పాటు వీరికి బ్రిడ్జి కోర్సు అమలు చేయనున్నారు. టెన్త్‌లోని వివిధ సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వనున్నారు.
రేపట్నుంచి 40 రోజుల పాటు బ్రిడ్జ్ కోర్సు
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు: 380
9వ తరగతిలో విద్యార్థులు : 16,341
బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం: శుక్రవారం నుంచి 40 రోజులు
బోధన విధానం : సబ్జెక్టుల్లోని ముఖ్య పాఠాలు
పరీక్షలు : కోర్సు చివరి వారంలో..
చిత్తూరు సెంట్రల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు టెన్త్ పాఠాలు నేర్పించేందుకు రాష్ట్ర పాఠశాల విద్య తెరతీసింది. 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 2న ప్రారంభమైన సమ్మేటివ్ అసెస్మెంట్-2 (వార్షిక పరీక్షలు) గురువారంతో ముగియనున్నాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు.. 40 రోజుల పాటు వీరికి బ్రిడ్జి కోర్సు అమలు చేయనున్నారు. టెన్త్‌లోని వివిధ సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఈ కోర్సు ఉపయోగపడనుంది. బ్రిడ్జ్ కోర్సులో భాగంగా టెన్త్ సిలబ్‌సలోని 7 సబ్జెక్టుల్లో 4 చాప్టర్ల వంతున బోధన సాగిస్తారు. వీటిలో క్లిష్టంగా ఉన్న పాఠ్యాంశాల బోధనకు ప్రాధాన్యమిస్తారు. తాము విన్న పాఠ్యాంశాలపై వచ్చే సెలవుల్లో ఇళ్లలోనే చదువుకునేలా సూచనలిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక టెన్త్‌లోని 7 సబ్జెక్టుల్లో మిగిలిన పాఠ్యాంశాలను బోధిస్తారు. తద్వారా వచ్చే విద్యా సంవత్సరం టెన్త్ సిలబస్ ముందుగానే పూర్తవుతుంది. మిగిలిన పనిదినాల్లో రివిజన్ చేస్తారు. దీంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెరిగి ఉత్తమ ఫలితాలు వస్తాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. కోర్సు చివరి వారంలో బోధన అంశాలపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. జవాబు పత్రాలు తక్షణం మూల్యాంకనం చేసి మార్కులను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. ఈ ప్రక్రియతో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవడంతో పాటు నైపుణ్యాన్ని పెంచుకునేందుకు సాధ్యపడుతుంది. సీ, డీ గ్రేడ్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్తీర్ణత వైపు అడుగులేస్తారు.
పదో తరగతికి సంసిద్ధుల్ని చేస్తుంది
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జ్ కోర్సు అమలుతో వచ్చే ఏడాది టెన్త్‌లో మరింత ఉత్తమ ఫలితాల సాధనకు వీలుంటుంది. 40 రోజుల పాటు తొమ్మిదవ తరగతి విద్యార్థులు పది పాఠాలను ప్రణాళిక బద్ధంగా నేర్పించడంతో వారిలో ఉత్సాహం నింపడంతో పాటు, మానసిక స్థితిని మెరుగుపర్చి, పదో తరగతికి సంసిద్ధుల్ని చేస్తుంది. బ్రిడ్జ్ కోర్స్ సమర్థ నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం.
- రాజేంద్రప్రసాద్, డీఈవో
ప్రైవేటు పాఠశాలకు దీటుగా..
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు రాణించే అవకాశం ఉంది. హాజరు తగ్గకుండా, బలోపేతం అవుతాయి. బేసిక్ ఫౌండేషన్ నేర్పించడం ద్వారా పదిలో సులభతరంగా పాఠ్యాంశాలు అర్థం చేసుకోవచ్చు.
- ఎస్.హస్సన్ బాషా, హెచ్‌ఎం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చిత్తూరు
బేసిక్స్‌తో స్కోరింగ్ చేసే వీలుంది
ఇప్పుడే బేసిక్స్ నేర్చుకోవడంతో వచ్చే ఏడాది టెన్త్‌లో అన్ని సబ్జెక్టుల్లోనూ మరింత స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. బ్రిడ్జ్ కోర్సులో నేర్చుకున్న పాఠ్యాంశాలను వేసవి సెలవుల్లో పరిశీలిస్తే, టెన్త్‌లో చదువుకోవడం సులభమవుతుంది.
- కేఎం హరిణి, నైన్త్ విద్యార్థిని, చిత్తూరు
వెనుకబడిన సబ్జెక్టుల్లో రాణించవచ్చు
బ్రిడ్జ్ కోర్సు ద్వారా వెనుకబడిన సబ్జెక్టుల్లో రాణించొచ్చు. టీచర్లు ఇచ్చే అసైన్‌మెంట్ ద్వారా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సులభంగా నేర్చుకోవచ్చు. వేసవి సెలవుల్లోనూ మిగిలిన సబ్జెక్టులపై పట్టు సాధించి, ధైర్యంగా టెన్త్‌లో స్కోరింగ్ చేయవచ్చు.
- పి.బి.జయదేవ్, నైన్త్ విద్యార్థి, చిత్తూరు.