ప్రభుత్వ భూముల కబ్జాపై సీఐడీ విచారణ జరపాలి
ABN , Publish Date - May 12 , 2026 | 02:18 AM
వెంకటగిరిలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల కబ్జాపై సీఐడీ విచారణ జరిపించాలని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
వెంకటగిరి టౌన్, మే 11(ఆంధ్రజ్యోతి): వెంకటగిరిలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల కబ్జాపై సీఐడీ విచారణ జరిపించాలని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తపరిచిన సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలతో కబ్జాచేసే ప్రయత్నాల్లో ఉన్నందున రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని సీఐడీ విచారణ జరిపించాలన్నారు. సమితి కార్యాలయాన్ని షేక్ అబ్దుల్ కరీం సాహెబ్, దంపెళ్ల వెంకటసుబ్బయ్య వారసులంటూ కొద్దిమంది దొంగ రికార్డును తయారు చేసి కొట్టేసే ప్రయత్నంలో ఉన్నారన్నారు. వెంకటగిరిలో ఏడాదిగా కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు రెవెన్యూ అధికారుల అండతో కొందరు దొంగ పత్రాలు సృష్టించి కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటీకే ఎన్జీవో, ఈఎ్‌సఎస్ డిగ్రీ కళాశాల ఎదుట, కైవల్యా నది ఒడ్డున బఫర్ జోన్ అని తెలిసినప్పటికీ నిర్మాణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనంతరం ఈ విషయాలపై ఎమ్మెల్యే రామకృష్ణకు అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రమణారెడ్డి, గౌస్‌బాషా, వీవీ రమణయ్య, సుబ్బరాయుడు, కృష్ణారెడ్డి, నరసింహులు, రాజేష్, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.
కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటాం
ఫ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
వెంకటగిరి, మే 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాలను ఉపేక్షించబోమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. వెంకటగిరిలో పెచ్చుమీరిపోతున్న ఆక్రమణలపై సోమవారం పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై స్పందించిన ఆయన వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.విశ్వోదయ కళాశాల స్థలం విషయంలో అక్రమ రిజిస్ర్టేషన్లను వెంటనే రద్దు చేయాలని తహసీల్దారు శిరీషకు సూచించారు. అమ్మవారిపేట చెరువును సర్వే చేసి ఆక్రమణలను, అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించారు. రాపూరు క్రాస్ రోడ్డు సమీపంలో నాలుగంతస్తుల భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టివుంటే కూల్పివేయాలని మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారికి సూచించారు. ఉపాధ్యాయ నగర్‌లో అక్రమంగా వేసిన లేఅవుట్‌ను తొలగించి ఆస్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఎన్జీవో కాలనీలో జరిగిన అక్రమ రిజిస్ర్టేషన్‌పై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.విశ్వోదయ కళాశాలకు ఎదురుగా ఉన్న స్థలంలో కబ్జాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.